బలపరీక్షలో నెగ్గిన సైనీ

బలపరీక్షలో నెగ్గిన సైనీ
  •     అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన హర్యానా సీఎం
  •     వాయిస్ వోట్​తో ఆమోదించిన సభ 

చండీగఢ్:  హర్యానా కొత్త సీఎం నాయబ్ సింగ్ సైనీ బల పరీక్షలో నెగ్గారు. బుధవారం అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. సీఎం సైనీ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై రెండు గంటల పాటు చర్చ అనంతరం వాయిస్ వోట్ ద్వారా తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా ప్రకటించారు. అధికార పార్టీ బీజేపీతో విభేదాలు వచ్చాయని చెప్తున్న జన్ నాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎమ్మెల్యేలు తీర్మానంపై వోటింగ్​కు దూరంగా ఉన్నారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా బీజేపీకి 41 మంది, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

 హర్యానా లోక్ హిత్ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీకి చెరొకరు, ఇండిపెండెంట్లు ఏడుగురు ఉన్నారు. వీరిలో ఆరుగురు ఇండిపెండెంట్లు, హర్యానా లోక్ హిత్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో మొన్నటిదాకా బీజేపీకి మద్దతు ఇచ్చిన జేజేపీ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకపోయినా, ప్రభుత్వానికి మ్యాజిక్ ఫిగర్ (46) కంటే ఇద్దరు సభ్యులు ఎక్కువే ఉన్నారు. ఇక బుధవారం వోటింగ్​కు గైర్హాజరు కావాలని జేజేపీ విప్ జారీ చేయగా.. ఆ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఐఎన్ఎల్డీ సభ్యుడు కూడా సభ నుంచి బయటకు వెళ్లారు. తీర్మానంపై చర్చ తర్వాత సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వోటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయగా స్పీకర్ తిరస్కరించారు. వాయిస్ వోట్ నిర్వహించి, తీర్మానం పాస్ అయినట్లు ప్రకటించారు.

ఎమ్మెల్యే పదవికి ఖట్టర్ రాజీనామా

హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తాజాగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఖట్టర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన రాజీనామా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే ఖట్టర్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ.. “తొమ్మిదిన్నరేండ్లుగా శాసనసభాపక్ష నేతగా పనిచేశా. తుది శ్వాస విడిచే వరకు హర్యానా ప్రజలకు సేవ చేస్తా. కర్నాల్ ప్రజలు నన్ను రెండు సార్లు అసెంబ్లీకి పంపించారు. ఇకపై ఈ నియోజకవర్గ బాధ్యతలు సీఎం సైనీ చూసుకుంటారు. బీజేపీ నాకు ఏ బాధ్యత అప్పగిస్తే దానిని నెరవేరుస్తా” అని ఖట్టర్ పేర్కొన్నారు.