సత్యకుమార్ పై దాడి చేయించాల్సిన అవసరం మాకు లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

సత్యకుమార్ పై దాడి చేయించాల్సిన అవసరం మాకు లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

బీజేపీ నేత సత్యకుమార్ పై దాడులు చేయించాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.రాజధాని అమరావతి రైతుల పోరాటానికి 1200 రోజులు కాగా, రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ కారుపై అమరావతి ప్రాంతంలో రాళ్ల దాడి జరిగింది. మార్చి 31వ తేదిన రైతుల దీక్ష శిబిరం నుంచి సత్య కుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తలను కలిసేందుకు వెళుతుండగా, ఉద్ధండరాయునిపాలెం వద్ద ఆయన కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ దాడిపై సజ్జల స్పందించారు. అమరావతి ఉద్యమంతో పాటు అందులో పాల్గొంటున్న పార్టీలపై ఆయన మండిపడ్డారు సజ్జల.  సత్యకుమార్ దగ్గర నిరసనలు జరిగి ఉండొచ్చని.. బూతులు తిడితే జనం ఊరుకుంటారా అని ప్రశ్నించారు సజ్జల. 

అమరావతి పేరుతో జరుగుతున్నది ఉద్యమం కాదని సజ్జల తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చంద్రబాబు బినామీలు నడుపుతున్నదేనన్నారని సజ్జల నిలదీశారు. అమరావతి కృత్రిమ ఉద్యమం అన్నది రుజువైందని సజ్జల పేర్కొన్నారు. యాత్రలు చేసి సగం దూరం తిరిగొచ్చారని అమరావతి రైతులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతిలో రైతులు భూములు ఎప్పుడో అమ్ముకున్నారన్నారన్నారు. 1200 రోజులు కాదు.. లక్ష రోజులైనా ఉద్యమం చేసుకోవచ్చంటూ అమరావతి రైతులపై సజ్జల వ్యాఖ్యలు చేశారు. అధికారం, రాజకీయమే టీడీపీ అజెండా అన్నారు. అధికారం కోసం చంద్రబాబు తోడేళ్ల మందను ఏకం చేస్తున్నారని, చంద్రబాబు అదే నిజమని భ్రమింప జేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన సత్యకుమార్.. తనపై దాడి పక్కా పథకం ప్రకారం జరిగిందని వెల్లడించారు. తన కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కారుపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్నారేంటని తాము ప్రశ్నిస్తే, తమ వాళ్లనే పోలీసులు నెట్టివేశారని సత్యకుమార్ తెలిపారు.దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇలాంటి దాడులకు సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు సత్యకుమార్.