టాలీవుడ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ బుధవారం (2026 జనవరి7న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది 2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ నేపథ్యంలో వేరువేరుగా తిరుమల వెళ్లిన ఈ క్రేజీ హీరోయిన్లు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఐశ్వర్య రాజేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు.. ఈ ‘సంక్రాంతి’ హీరోయిన్లకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తితిదే అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మరోవైపు, ‘అనగనగా ఒక రాజు’ సినిమా విడుదలను పురస్కరించుకుని మీనాక్షి చౌదరి ఉదయం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. తన సినిమా ఘనవిజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మీనాక్షి చౌదరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
“అనగనగా ఒక రాజు సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు శ్రీవారి దర్శనం చేసుకోవడం నాకు సెంటిమెంట్‌గా మారింది. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని, సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నట్లు’’ మీనాక్షి తెలిపింది.
అలాగే, మా సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి” అని మీనాక్షి ప్రేక్షకులని కోరింది. ఇకపోతే, ప్రస్తుతం మీనాక్షి చౌదరి.. అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తుంది.
