
ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించారు. బస్సులో జన్మించిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో జూలై 5వ తేదీ శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో బస్సు ఎక్కారు. బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్ సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అనంతరం మెరుగైన వైద్యం కోసం బుస్సులోనే సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
సమయస్పూర్తితో స్పందించి.. సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీ సేవలను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. వారు చాకచక్యంగా వ్యవహరించడంతోనే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని చెప్పారు.