మన దగ్గరే.. సలార్ టికెట్ రేట్లు చాలా ఎక్కువ..

మన దగ్గరే.. సలార్ టికెట్ రేట్లు చాలా ఎక్కువ..

దేశంలో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఫీవర్ కొనసాగుతోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ ట్రైలర్ తో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.  ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. విడుదలకు రెండు రోజులే ఉండడంతో ప్రేక్షకులు టికెట్ బుకింగ్స్  చేసుకుంటున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. 

ఆఫ్ లైన్ లోనూ టికెట్ తీసుకునేందుకు భారీగా అభిమానులు థియేటర్ల  వద్దకు చేరుకుంటున్నారు. అయితే, ఈ సినిమా టికెట్ రేట్స్ పై ప్రస్తుతం హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ టికెట్ రేట్లను భారీగా పెంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది. నైజాంలో వారం రోజుల పాటు సలార్ టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్‌ షోతో పాటు అదనపు షోలకు మూవీ నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోరారు. హైదరాబాద్‌ మల్టీప్లెక్స్ థీయేటర్లలో టికెట్ పై 100 రూపాయలు పెంచనున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ప్రభుత్వం దీనికి అనుమతిస్తే.. దేశంలో మనదగ్గరే  సలార్ మూవీ అత్యధిక టికెట్ ధరలు ఉండనున్నాయి. ఉదహారణకు.. గచ్చిబౌలిలోని ప్లాటినమ్ మూవీటైమ్, ప్రీమియం సినిమా చూస్తే సాధారణంగా ఒక్కో టికెట్‌కు రూ. 350 వసూలు చేస్తుంది.  టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిస్తే..  మొదటి వారంలో అదనపు రూ.100,18% GSTతో సహా టికెట్ ధర రూ. 530కి పెరగవచ్చు. ఇక, స్పెషల్ షోలకు అయితే ఒక్కో టికెట్ వేలల్లో కొనాల్సిందే.

ముంబైలో అత్యధిక టిక్కెట్ ధర రూ. 2500 కాగా.. ఢిల్లీలోని కొన్ని థియేటర్లు ఒక టికెట్ ధర రూ. 1800కి విక్రయిస్తున్నాయి. హైదరాబాద్ లో ఇంకా టికెట్ ధరలు ప్రకటించలేదు... టికెట్ ధరలు పెంచితే మాత్రం దేశంలోనే అత్యధిక టికెట్ ధరలు మనదగ్గరే ఉండనున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.