6 నెలలుగా జీతాల కోసం 94 మంది లెక్చరర్ల ఎదురుచూపులు

6 నెలలుగా  జీతాల కోసం 94 మంది లెక్చరర్ల ఎదురుచూపులు
  • కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన
  • నెలనెలా అందించేలా చూడాలని రిక్వెస్టులు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్​లెక్చరర్లకు ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నెలలు తరబడి పెండింగ్​పెడుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 94 మంది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. 2012లో ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్ లెక్చరర్ వ్యవస్థను తీసుకురాగా, తెలంగాణ వచ్చాక కూడా కొనసాగిస్తున్నారు. ఏండ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న తమను పర్మినెంట్ చేయకపోగా, జీతాల కోసం ఎదురు చూసేలా చేయడం కరెక్ట్​కాదని గెస్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తే ‘ఇష్టం ఉంటే పనిచేయండి.. లేకపోతే మానేయండి’అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ క్లాసులు

గెస్ట్ లెక్చరర్లకు ఒక్కో పీరియడ్ కు రూ.390 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 72 పీరియడ్లు బోధిస్తే నెలకు రూ.28,080 జీతం వస్తుంది. అయితే ఆదివారం, రెండో శనివారాలు, పండుగలు, ఇతర ప్రభుత్వ సెలవులతో నెలకు 72 పీరియడ్స్ కంప్లీట్అవ్వవు. నెలకు 55 నుంచి 58 క్లాసులే ఉంటున్నాయి. ఈ లెక్కన ఒక్కో గెస్ట్​లెక్చరర్​కు సగటున రూ.21,500 వేతనం వస్తోంది. ట్రాన్స్​పోర్టు, ఇతర ఖర్చులు పోను రూ.16 వేలు ఉంటున్నాయని, వాటితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాలేజీలో క్లాసులతోపాటు ఇతర సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరంలో రెండు దఫాలు మాత్రమే జీతాలు ఇస్తున్నారని వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు నెలనెలా ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

పదేళ్లుగా గెస్ట్ లెక్చరర్​గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం ఏ పని చెప్పినా విజయవంతం చేసి చూపిస్తున్నాం. అయినా మాకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలి. టైంకు జీతాలు వేయాలి. 
– వెంకటేశ్వర్లు, గెస్ట్ లెక్చరర్, సదాశివపేట

పెండింగ్​ పెట్టిన వేతనాలు ఇవ్వాలి

పెండింగ్ పెట్టిన వేతనాలు ఇవ్వాలి. ఆరు నెలలుగా జీతాలు ఇయ్యకుంటే కుటుంబం ఎలా గడవాలి. అధికారులు స్పందించి నెలనెలా జీతం ఇవ్వాలి. లేకుంటే ఐక్యంగా ఉద్యమించాల్సి వస్తది.
– శ్రీశైలం, గెస్ట్ లెక్చరర్, సంగారెడ్డి