- ఇబ్బందులు పడుతున్న లెక్చరర్ల కుటుంబాలు
- డిగ్రీ, డైట్ కాలేజీల్లో నవంబర్ నుంచి, జూనియర్ కాలేజీల్లో మార్చి నుంచి పెండింగ్
- మోడల్ స్కూల్ ఒకేషనల్ టీచర్ల పరిస్థితి అంతే..
హైదరాబాద్ : రాష్ట్ర సర్కారు గెస్ట్ లెక్చరర్లకు సక్కగా జీతాలు ఇస్తలేదు. సర్కారు కాలేజీల్లో పనిచేసే వారికి ఆరేడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇచ్చే జీతమే తక్కువ అదీ సమయానికి రాకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్కారు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లు, మోడల్ స్కూళ్లలో పనిచేసే ఒకేషనల్ టీచర్లు అప్పులు చేసి కుటుంబాలను సాకుతున్నరు. మరికొందరు కూలీ పనులకు వెళ్తున్నరు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఉన్నతాధికారులు చెప్తున్నరు. రాష్ట్రంలో 128 సర్కారు డిగ్రీ కాలేజీల్లో 1,141 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నరు. వీరికి నెలకు రూ.21,600 జీతంగా ఇస్తున్నరు. ఫిబ్రవరిలో 30 శాతం పీఆర్సీ పెంపు ఉత్తర్వులిచ్చారు. ఆ నెల నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. ఈ లెక్కన ఫిబ్రవరి నుంచి వారికి రూ.28,080 అందాలి. అయితే పెంచిన జీతాలు ఇయ్యకపోగా, గత ఏడాది నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలు కూడా విడుదల చేయలేదు.
కమిషనర్ కు లేఖ :
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 405 జూనియర్ కాలేజీల్లో1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నరు. వీరికి నెలకు రూ.21,600 జీతంగా అందుతోంది. మార్చి నుంచి వీరి జీతాలు పెండింగ్‌లో ఉన్నయి. హనుమకొండకు జిల్లాకు చెందిన 14 మంది గెస్ట్ లెక్చరర్లకు గత ఏడాదికి సంబంధించి 3 నెలల బకాయిలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై ఆ జిల్లా డీఐఈవో రెండుసార్లు కమిషనర్‌కు లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదు. మరోవైపు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో 150 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నరు. వారికి నెలకు రూ.18 వేలు జీతం కాగా, గత ఏడాది నవంబర్ నుంచి వేతనాలు రావడం లేదు. 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 388 మంది ఓకేషనల్ టీచర్లు పరిస్థితి అలాగే ఉంది. నెలకు రూ.20 వేల జీతం అందుకుంటున్న వీరి వేతనాలు కూడా జనవరి నుంచి ఏప్రిల్ వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
అప్పులతోనే నడుపుతున్నరు :-
సర్కారు కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. పేరుకు సర్కారు కాలేజీల్లో పనిచేస్తున్నం అని చెప్పుకుంటున్నా.. నెలనెల జీతాలు సక్కగా రావడం లేదు. దీంతో కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేస్తున్నరు. కొందరు బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని, జీతాలొచ్చాక విడిపించుకుంటున్నరు. మరికొందరు ఇతర పనులు, ఇంకొందరు ఉపాధి, కూలీ పనులకూ వెళ్తున్నరు. ప్రతి ఉద్యోగికి 30 శాతం పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఇంకా విద్యాశాఖలో అమలు కావడం లేదు. సర్కారు జూనియర్, డైట్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు, మోడల్ స్కూళ్లలో పనిచేసే ఒకేషనల్ టీచర్లకు 30 శాతం జీతాల పెంపుపై ఇప్పటికీ జీవో ఇవ్వలేదు. కేవలం డిగ్రీ కాలేజీల గెస్టు లెక్చరర్లకు మాత్రమే అమలు చేస్తామని సర్కారు జీవో ఇచ్చినా, పెరిగిన జీతాలు మాత్రం వారు ఇంకా అందుకోలేదు.
ఉపాధి పనులకు పోతున్నం :-
రాష్ట్రవ్యాప్తంగా 388 మంది ఒకేషనల్ టీచర్లు పనిచేస్తున్నరు. జనవరి నుంచి జీతాలు రావట్లేదు. కొందరు అప్పులు తీసుకునేందుకు ఇష్టం లేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి పనులకు పోతున్నరు. మరికొందరు లేబర్ పనులు, కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ అమలు చేసి, పెండింగ్ జీతాలు ఇవ్వాలని టీఎంఎస్‌వీటీఏ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం : -
ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స
పోడు పట్టాలియ్యకుండా హరితహారమేంది?
