పోడు పట్టాలియ్యకుండా హరితహారమేంది?

పోడు పట్టాలియ్యకుండా హరితహారమేంది?
  • సీఎం కేసీఆర్‌‌‌‌కు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ లేఖ
  • గిరిజనులను నయవంచనకు గురిచేస్తున్నరు
  • 3.5 లక్షల దరఖాస్తులు తీసుకుని పట్టించుకోలే
  • పోడు రైతులకు  పట్టాలిచ్చేలా ఇప్పటికైనా చర్యలు చేపట్టాలె

హైదరాబాద్ : పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వాటిలో హరితహారం చేపట్టడం.. గిరిజనులను నయవంచనకు గురిచేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఒకవైపు పట్టాల కోసం ఆందోళనలు జరుగుతుంటే.. మరోవైపు ఫారెస్ట్ అధికారులు హరితహారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆ భూముల్లో హరితహారం కార్యక్రమం నిలిపివేయాల‌‌ని డిమాండ్ చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్‌‌‌‌కు సంజయ్ లేఖ రాశారు.ప్రభుత్వ చర్యల వల్ల గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని అన్నారు. గతంలో ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి చర్యల వల్ల గిరిజనులకు, ఫారెస్టు అధికారులకు మధ్య ఘర్షణలు తలెత్తాయని, అనేక జిల్లాల్లో గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 

కుర్చీ వేసుకుని పట్టాలిస్తామన్నరుగా..
తాము హరితహారం కార్యక్రమానికి వ్యతిరేకం కాదని, కేవ‌లం పోడు భూముల్లో నిలిపివేయాల‌ని కోరుతున్నామని బండి సంజయ్ చెప్పారు. ఇత‌ర ప్రాంతాల్లో హ‌రితహారం కార్యక్రమం చేప‌డితే బీజేపీకి ఎలాంటి అభ్యంత‌రం లేదని పేర్కొన్నారు. ‘‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దాదాపు మూడున్నర లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పోడు సమస్య పరిష్కారానికి రాష్ట్ర యంత్రాగాన్నంతా తీసుకునిపోయి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 నవంబర్‌ 23న మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడురైతులకు పట్టాలు అందజేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి దాకా పోడు భూముల సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంది’’ అని మండిపడ్డారు.

 

గిరిజనుల హక్కులను కాలరాస్తున్నరు
రాష్ట్రంలో 24 జిల్లాల్లో 10 లక్షలకు పైగా పోడు భూముల పట్టాల సమస్య ఉందని, 2,450 ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. పోడు భూముల సమస్యపై తాత్సారం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు. చట్టపరంగా గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరమన్నారు. పోడు భూమి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజనుడు, ఆదివాసీకి పట్టా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన కేసులను విత్‌డ్రా చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోడుదారులకు పట్టాలిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్య పరిష్కరించకుండా పోడు భూముల్లో హరితహారం చేపడితే ఎదురయ్యే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ భూముల కోసం పోరాడుతున్న గిరిజనులకు, ఆదివాసీలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం : -

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి


సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ