కంటి వెలుగు స్టాఫ్​కు శాలరీలు పెండింగ్​

కంటి వెలుగు స్టాఫ్​కు శాలరీలు పెండింగ్​
  • ‘కంటి వెలుగు’ స్టాఫ్​కు శాలరీలు పెండింగ్​
  • రెండో విడత  ప్రోగ్రాం సిబ్బందికి ఆగిన రెండు నెలల జీతాలు​
  • స్కీం సక్సెస్​ కారకులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
  • ఏఆర్​ మిషన్లు, కార్ల రెంట్లు కూడా అదే పరిస్థితి 
  • ప్రభుత్వమే పెండింగ్​ పెట్టిందంటున్న జిల్లా ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు :  ‘కంటి వెలుగు’ ప్రోగ్రాం పూర్తయి రెండు నెలలు అవుతున్నా  సిబ్బందికి చివరి రెండు నెలల వేతనాలు అందలేదు. ప్రోగ్రామ్​లో ఔట్​ సోర్సింగ్​లో పనిచేసిన పారా మెడికల్ ఆప్తాల్మిక్​ ఆఫీసర్/ ఆప్తోమెట్రిస్ట్ లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కార్లు లీజుకు పెట్టిన ఓనర్లు తమకు రావాల్సిన  మే, జూన్​ పెండింగ్ బిల్లుల కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. తాము బిల్లులను సబ్మిట్​ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఫండ్స్​ రావాల్సి ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.  దీంతో రాష్ట్ర ఆప్తాల్మిక్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో  వైద్యారోగ్య శాఖ కమిషనర్​ ను, హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావును కూడా కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.  పెండింగ్ శాలరీలు ఇవ్వడంతో పాటు తమను పీహెచ్​సీలు, ప్రభుత్వ దవాఖానల్లోకి రెగ్యులర్​ డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా షురూ చేసి.. 

రాష్ట్రంలో రెండో విడత కంటి విడత కార్యక్రమాన్ని జనవరి 18న  ఖమ్మంలో సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. ఢిల్లీ, పంజాబ్​, కేరళ రాష్ట్రాల సీఎంలు, పలువురు జాతీయ స్థాయి నాయకులు ఇందులో  పాల్గొన్నారు. జూన్​ నెలాఖరు వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 15,527 క్యాంపులు నిర్వహించారు. రాష్ట్రం మొత్తం మీద 1.61 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయగా, 40.59 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని తేలింది. ఇందులో 22.51 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు, 18.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్  కళ్లద్దాలు అందించారు. ఈ మొత్తం కార్యక్రమంలో 1,500 ఆఫ్తాల్మిక్​ ఆఫీసర్లు ఔట్​ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.30 వేల చొప్పున వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, మే, జూన్ నెలలకు సంబంధించిన డబ్బులు పెండింగ్ ఉన్నాయి.  వీటితో పాటు కంటి పరీక్షలకు ఉపయోగించే ఆటో రిఫ్రాక్టోమీటర్​ (ఏఆర్​) మిషన్​ లను కూడా ఆప్తాల్మిక్​ ఆఫీసర్లే రెంట్​కు తీసుకొచ్చారు. ఒక్కో మిషన్​ కు నెలకు రూ.25 వేల చొప్పున దాదాపు 500 మిషన్లను ఐదు నెలలు ఉపయోగించుకున్నా  ఒక్క పైసా కూడా అద్దె చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు నెలకు రూ.33 వేల చొప్పున తమ కార్లు కిరాయికి తిప్పుకొని, రెంటు కూడా రెండు నెలలు పెండింగ్ పెట్టారని ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రూ.300కోట్లు కేటాయించామని చెప్పినా.. 

కంటి వెలుగు సక్సెస్​ కోసం దాదాపు 10 మంది సిబ్బందితో ఒక టీమ్​ చొప్పున,  రాష్ట్రవ్యాప్తంగా 1,500 టీమ్​ లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ఆశా వర్కర్లు, ఇద్దరు ఏఎన్​ఎంలు,  ఒక సూపర్​ వైజర్​, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక మెడికల్ ఆఫీసర్​,  ఒక పారామెడికల్ ఆప్తాల్మిక్​ ఆఫీసర్​,  మరో ఇద్దరు అడిషనల్​ స్టాఫ్ ఉండేవారు. రెండో విడత కంటి వెలుగు కోసం రూ.300 కోట్లకు పైగా కేటాయించి ఖర్చు చేశామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుండగా, పెండింగ్ బిల్లులపై బాధితులు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు.  ఇక తమ బిల్లుల్లో  కూడా కొన్ని జిల్లాల్లో డీఎంహెచ్​వో,  థర్డ్ పార్టీ ఔట్​ సోర్సింగ్ మధ్య రహస్య ఒప్పందాలతో ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.800 వరకు అదనంగా కట్ చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రోజుకు రూ.250 చొప్పున చెల్లిస్తామన్న భోజన ఖర్చుల విషయంలో కూడా తమను ఇబ్బంది పెట్టారని అంటున్నారు.  

వెంటనే విడుదల చేయాలి.. 

కంటి వెలుగు ప్రోగ్రాం సక్సెస్​లో మా పాత్ర కీలకం.  మొదటి విడత కంటివెలుగులో ఎలాంటి ఇబ్బంది పడలేదు. కానీ రెండో విడతలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మే, జూన్​ నెలలకు సంబంధించిన శాలరీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఏఆర్​ మిషన్లకు ఐదు నెలల రెంట్​ ఇవ్వలేదు. పెండింగ్ బిల్లుల సమస్య గురించి, మా సర్వీసులను రెగ్యులర్​గా ఉపయోగించుకోవడం గురించి మంత్రి హరీశ్​రావును కలిశాం. రాష్ట్రంలో 30, 35 ఏండ్ల నుంచి పారామెడికల్ ఆప్తాల్మిక్​ ఆఫీసర్ల రిక్రూట్ మెంట్​ చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రెగ్యులర్ గా పనిచేస్తున్న వాళ్లు 120 మంది లోపు మాత్రమే ఉన్నారు. వాళ్లు కూడా రెండేళ్లలో రిటైర్​ కానున్నారు.  

‌‌‌‌ - మిడ్తనపల్లి సురేశ్​, తెలంగాణ ఆప్తో మెట్రిస్ట్/ఆప్తాల్మిక్ ఆఫీసర్స్​ అసోసియేషన్​​ రాష్ట్ర అధ్యక్షుడు

బిల్లులు సబ్మిట్ చేశాం..

ఖమ్మం జిల్లాలో కొందరు జూన్​ 2 వరకు, మరికొందరు జూన్​ 10 వరకు పనిచేశారు. మే నెల పూర్తి వేతనాలు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. వేతనాలు, కార్ల రెంట్లకు సంబంధించిన అన్ని బిల్లులు ప్రభుత్వానికి సబ్మిట్ చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్​ కావాల్సి ఉంది. వారం రోజుల్లోపు విడుదలయ్యే అవకాశముంది.  

-  మాలతి, డీఎంహెచ్​వో, ఖమ్మం