కార్పొరేట్ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయంట

కార్పొరేట్ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయంట

రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు 10 శాతం పెరుగుతాయని, గత ఏడాది పెరుగుదల 9.9 శాతం కంటే ఇది స్వల్పంగా ఎక్కువని విలిన్‌‌ టవర్స్‌‌ వాట్సన్‌‌ సర్వే తెలిపింది. ఈ కంపెనీ తయారు చేసిన ‘క్యూ3 2019 సాలరీ బడ్జెట్ ప్లానింగ్‌‌ రిపోర్ట్‌‌’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో ఇదే అత్యధిక పెరుగుదల అని ఈ గ్లోబల్‌‌ అడ్వైజరీ బ్రోకింగ్‌‌ అండ్‌‌ సొల్యూషన్స్‌‌ కంపెనీ తెలిపింది. ఇండోనేసియాలో ఎనిమిది శాతం, చైనాలో 6.5 శాతం, ఫిలిప్పీన్స్‌‌లో ఆరు శాతం, హాంకాంగ్‌‌, సింగపూర్‌‌లో నాలుగుశాతం చొప్పున జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ రిపోర్టు అంచనా వేసింది. ఈ సందర్భంగా కంపెనీ కన్సల్టెంట్‌‌ లీడర్‌‌ మాట్లాడుతూ ‘‘జీతాల పెంపు విషయంలో కంపెనీలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. గత ఏడాది పెంచిన శాతాలనే ఎక్కువ కంపెనీలు కొనసాగిస్తున్నాయి. పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడటం లేదు. ఆటోమేషన్‌‌, డిజిటైజేషన్‌‌ నైపుణ్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్‌‌ ఇస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

సానుకూలత తక్కువే..

విలిస్‌‌ టవర్స్‌‌ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 28 శాతం రాబోయే 12 నెలల్లో ఆదాయం పెరుగుతుందని ఆశాభావం ప్రకటించాయి. అయితే గత ఏడాది 37 శాతం కంపెనీలు తమ రెవెన్యూ పెరుగుతుందని చెప్పాయి. కొత్త సంవత్సరంలో పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని 61 శాతం సంస్థలు పేర్కొన్నాయి. గత ఏడాది ఇలాంటి అభిప్రాయాన్ని 57 శాతం కంపెనీలు ప్రకటించాయి. 11 శాతం కంపెనీలు మాత్రం రెవెన్యూ పెరక్కపోవచ్చని చెప్పాయి. 2018లో ఐదు శాతం కంపెనీలు మాత్రమే రెవెన్యూ తగ్గుతుందని చెప్పాయి.  సాధారణ కంపెనీలతోపాటు కెమికల్‌‌, హైటెక్‌‌, ఫార్మా సెక్టార్లల్లో జీతాలు 10 శాతం, ఇంధనం, ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌, కన్సూమర్‌‌ ప్రొడక్ట్స్‌‌ సెక్టార్ల జీతాల పెరుగుదల కాస్త తక్కువగా ఉంటుంది. ఇంధనరంగంలో 2019లో 8.5 శాతం పెరగగా, వచ్చే ఏడాది 9.3 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్‌‌ సెక్టార్‌‌లో ఇది తొమ్మిది శాతం నుంచి 9.7 శాతానికి పెరగొచ్చు. కన్సూమర్‌‌ ప్రొడక్ట్స్‌‌ సెక్టార్‌‌ ఇది 9.5 శాతం నుంచి 9.9 శాతానికి చేరవచ్చని ఈ సర్వే రిపోర్టు వివరించింది. మెడియన్‌‌ సాలరీ ఎగ్జిక్యూటివ్‌‌ స్థాయిలో గత ఏడాది 9.6 శాతం పెరగగా, వచ్చే ఏడాది 10.1 శాతం పెరిగే చాన్స్‌‌ ఉంది. శ్రామికుల జీతాలు 10 శాతం నుంచి 10.3 శాతం వరకు పెరుగుతుందని అంచనా. సాలరీ బడ్జెట్‌‌లో 25 శాతం మొత్తాన్ని టాప్‌‌ ఫెర్మార్మర్లకు కేటాయిస్తారు. ఇలాంటి వాళ్లు 11.5 శాతం మంది ఉంటారని అంచనా.