మోడల్ స్కూల్ టీచర్లకు 4 నెలలుగా జీతాల్లేవ్

మోడల్ స్కూల్ టీచర్లకు 4 నెలలుగా జీతాల్లేవ్
  • తీవ్ర ఇబ్బందుల్లో హవర్లీ బేస్డ్ టీచర్లు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న హవర్లీ బేస్డ్ టీచర్లకు వేతన ఇబ్బందులు తప్పడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు నెలలుగా వారికి జీతాలు అందడం లేదు. కనీసం దసరా పండుగ వరకైనా వస్తాయన్న వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో అప్పులు చేసి తూతూ మంత్రంగా పండుగ చేసుకున్నారు. స్టేట్​లో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, వాటిలో 1,200 మందికి పైగా హవర్లీ బేస్డ్ టీచర్లు పని చేస్తున్నారు. ఒక్కో పీరియడ్​కు రూ.182 చొప్పున వారికి వేతనం ఇస్తున్నారు. వీరంతా నెలకు వంద పీరియడ్లు చెప్తే, దానికి రూ.18,200 వేతనం ఇస్తారు. ఇచ్చేదే తక్కువ వేతనం.. దాన్ని నెలల తరబడి పెండింగ్​లో పెట్టడంతో ఆ టీచర్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

స్కూళ్ల ప్రారంభం నుంచి జీతాల్లేవ్

ప్రస్తుతం పనిచేస్తున్న హవర్లీ బేస్డ్ టీచర్లలో కొందరిని స్కూళ్ల ప్రారంభంలోనే విధుల్లోకి తీసుకున్నారు. ఇంకొందరిని ఆగస్టు నుంచి తీసుకున్నారు. దీంతో కొందరికి జూన్ నుంచి, ఇంకొందరికి ఆగస్టు నుంచి వేతనాలు రావాల్సి ఉంది. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో వెయ్యికి పైగా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జీతాల కోసం ఉన్నతాధికారులను అడిగితే.. ప్రతిసారీ వారం, పదిరోజులంటూ సమాధానం చెప్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం బతుకమ్మ, దసరా పండుగకైనా వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, జీతాలు మాత్రం రాలేదు. దీంతో తమ కుటుంబాల్లో దసరా వేడుకలు నామమాత్రంగానే జరిగాయని వారు చెప్తున్నారు. సకాలంలో జీతాలు అందకపోవడంతో కుటుంబాలను సాకేందుకు అప్పులు చేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే జీతాలు అందించాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు, నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం: రమణ కుమార్​

జీతాల కోసం 20 రోజుల క్రితమే ఆర్థిక శాఖకు ఫైల్ పంపామని, టెక్నికల్ సమస్యతో శాలరీలు ఆగిపోయాయని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ ‘వెలుగు’తో తెలిపారు. 3, 4 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. హవర్లీ బెస్డ్ టీచర్లు పనిచేసిన కాలానికి జీతాలిస్తామని చెప్పారు.