అసలు సూత్రధారులెవరు .. యువతే లక్ష్యంగా జోరుగా సాగుతున్న దందా

అసలు సూత్రధారులెవరు .. యువతే లక్ష్యంగా జోరుగా సాగుతున్న దందా
  • జిల్లాలో గంజాయి సప్లయ్​పై లోతైన ఎంక్వైరీ కరవు
  • కేవలం సప్లయ్​ చేసిన వారి అరెస్ట్​తో సరి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో కొంతకాలంగా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాలకు గంజాయి సప్లయ్​ చేస్తున్నారు. యువతే టార్గెట్​గా ఏజెంట్లను నియమించుకొని గంజాయి సప్లయ్​ చేస్తున్నారు. 20 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 10 మంది యువకులు అరెస్టయ్యారు. వీరిలో ఐదుగురు సప్లయ్​ చేస్తున్న వారు కాగా, మరో ఐదుగురు గంజాయి తాగిన వారు ఉన్నారు.

సప్లయ్​చేస్తున్నది ఎవరు?

ఏపీలోని విశాఖ, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్​ఏరియాల నుంచి కామారెడ్డి జిల్లాకు గంజాయి సప్లయ్​ అవుతోంది. ఒకరి ద్వారా మరొకరికి చైన్​ సిస్టమ్​లో యూత్​కు గంజాయి సప్లయ్​చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల దందాపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్, ఎక్సైజ్ ఆఫీసర్లను ఆదేశించింది. జిల్లాలో ఇటీవల పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

అయితే ఇక్కడ అమ్ముతున్న వ్యక్తులకు గంజాయిని ఎవరు సప్లయ్​చేస్తున్నారు.. మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో మాత్రం ఎంక్వైరీ సాగడం లేదు. వారం, పది రోజులు హడావుడి చేస్తూ, కేసుల ఎంక్వైరీని మూలన పడేస్తున్నారు. దీంతో మళ్లీ అమ్మకాలు జరిగే ఊపందుకుంటున్నాయి. నాలుగు రోజుల కింద గాంధారి మండలంలోని ఓ తండాలో ఓ వ్యక్తి ఇంట్లో గంజాయి నిల్వ ఉందనే సమాచారంతో ఎక్సైజ్,​ఎన్​ఫోర్స్​మెంట్​ఆఫీసర్లు తనిఖీలకు చేయడానికి వెళ్లగా, స్థానికులు అడ్డుకున్నారు.

కామారెడ్డి టౌన్​తో పాటు, జిల్లాలోని పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా పోలీస్​ఉన్నతాధికారులు దృష్టి సారించి గంజాయి సప్లయ్​మూలలను కనుక్కొని, అసలు సూత్రధారులను పట్టుకొంటే శాశ్వత పరిష్కారం దొరికే ఛాన్స్​ ఉంటుంది.

లిక్విడ్​ రూపంలో గంజాయ్..​

15 రోజుల కింద కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో గంజాయి తాగుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరంతా కామారెడ్డి టౌన్​కు చెందిన యువకులు. ఇక్కడ లిక్విడ్​ రూపంలో గంజాయి పట్టుబడింది. గంజాయి సప్లయ్​చేసిన ఇద్దరిని జైలుకు పంపగా, ఐదుగురికి స్టేషన్​ బెయిల్​పై బయటకు పంపారు. కేసులో అరెస్టయిన వారి పేర్లను వెల్లడించలేదు. ఈ కేసు ఇంతటితో ఆగిపోయింది. పట్టుబడిన వారికి గంజాయి సప్లయ్​చేసిన వ్యక్తులెవరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దందాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ఎంక్వైరీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

మహారాష్ట్ర నుంచి సప్లయ్​

మహారాష్ట్రలోని నాందేడ్ ​నుంచి ట్రైన్​లో కామారెడ్డికి గంజాయి తీసుకొస్తూ ఇటీవల ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు కామారెడ్డి టౌన్​కు చెందిన వాళ్లు కాగా మరో యువకుడు నాందేడ్​ వాసి. వీరి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.4 రోజుల కింద నస్రుల్లాబాద్​ మండలంలో ఓ ఇంట్లో కిలో గంజాయి దొరికింది.