హైదరాబాద్ టీటీడీ ఆలయాల్లో పెరిగిన లడ్డూల విక్రయం

హైదరాబాద్ టీటీడీ ఆలయాల్లో పెరిగిన లడ్డూల విక్రయం

బషీర్ బాగ్, వెలుగు: సిటీలోని టీటీడీ ఆలయాల్లో తిరుపతి లడ్డూల విక్రయం పెరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాద ప్రభావం విక్రయాలపై పడలేదని ఆలయాల అధికారులు తెలిపారు. హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయాలకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో తిరుపతి నుంచి ఒక కంటైనర్​లో లడ్డూలు వస్తున్నాయి.

 ఈ నెల 4 నుంచి ప్రతిరోజూ ఆలయాల్లోని కౌంటర్లలో తిరుపతి లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే లడ్డూల వివాదానికి ముందు స్టాక్​పూర్తిగా అయిపోయేది కాదని, గడిచిన 10 రోజుల్లో వచ్చిన లడ్డూలు వచ్చినట్లు అయిపోతున్నాయని ఆలయాల అధికారులు చెప్పారు. ఒక్కో రోజు నో స్టాక్​బోర్డు పెట్టాల్సి వస్తుందన్నారు. రెండు టీటీడీ ఆలయాలకు కలిపి ఒక కంటైనర్​లో వస్తున్న10 వేల లడ్డూలు మూడు రోజుల్లోనే అయిపోతున్నాయని వెల్లడించారు. 

ఇంతకు ముందు మిగిలిపోయిన లడ్డూలను తిరిగి తిరుపతికి పంపించేవాళ్లమని తెలిపారు. భక్తులకు ఎన్ని లడ్డూలు కావాలన్నా ఇస్తున్నామని వివరించారు. లడ్డూ తీసుకున్న భక్తుల పేరు, ఫోన్ నెంబర్లను నోట్​చేస్తున్నామని, భక్తుల రద్దీకి  అనుగుణంగా భవిష్యత్ లో స్టాక్ పెంచుతామని చెప్పారు.