ధరణి దొరల చట్టమైతే .. భూభారతి పేదల చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

ధరణి దొరల చట్టమైతే .. భూభారతి పేదల చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి
  • ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌ను నియమిస్తాం

రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌/కుంటాల, వెలుగు : ధరణి దొరలకు చట్టమైతే... భూభారతి పేదల చట్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. ధరణికి, భూభూరతి చట్టానికి ఎంతో తేడా ఉందన్నారు. ధరణిని నాలుగు గోడల మధ్య నలుగురి స్వార్థం కోసం తయారు చేసుకున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా పెంచికల్‌‌‌‌పేట్‌‌‌‌, నిర్మల్ జిల్లా కుంటాలలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌‌‌‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వేలాది మంది సూచనలను పరిగణనలోకి తీసుకొని భూభారతి చట్టాన్ని రూపొందించామని చెప్పారు. 

గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములను లాక్కుందని ఆరోపించారు. భూభారతి చట్టంలో భూమి చుట్టు కొలతతో పాటు సరిహద్దుల సమాచారాన్ని పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌లో పొందుపరుస్తారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 953 మంది వీఆర్ఏలు, వీఆర్‌‌‌‌వోలు రోడ్డున పడ్డారన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌ను నియమిస్తున్నామని ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌‌‌‌మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు 4,600 ఇండ్లు మంజూరు చేశామని, ఇందులో 1,750 ఇండ్లను వేములవాడ నియోజకవర్గానికి కేటాయించినట్లు చెప్పారు. దేశంలోని 18 రాష్ట్రాలు తిరిగి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే భూభారతి చట్టాన్ని రూపొందించామని చెప్పారు. భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయడం రెవెన్యూ ఆఫీసర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఆఫీసర్లు డబ్బులు అడిగినా, ఇబ్బందులు పెట్టినా ఫిర్యాదు చేయడానికి టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో సీసీఎల్‌‌‌‌ఏ కమిషనర్‌‌‌‌ నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్, కలెక్టర్ సందీప్ కుమార్‌‌‌‌, ఎస్పీ మహేశ్‌‌‌‌ గీతే, పెంచికల్‌‌‌‌ పేట్‌‌‌‌లో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆఫీసర్లు శ్రీనివాసరావు, అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు దీపక్‌‌‌‌ తివారి, ఎం. డేవిడ్, కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ శ్రద్ధా శుక్లా, డీఎఫ్‌‌‌‌వో నీరజ్‌‌‌‌కుమార్‌‌‌‌, కుంటాలలో ముథోల్‌‌‌‌, ఖానాపూర్‌‌‌‌ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌ అభిలాష అభినవ్, అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు ఫైజన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి పాల్గొన్నారు.

ధరణితో రైతులు అవస్థలు పడ్డరు : మంత్రి సీతక్క

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు అనేక అవస్థలు పడ్డారన్నారు. సెంటు భూమి లేని వ్యక్తులు కూడా ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎకరాలకు ఎకరాలే ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీని వల్ల అసలైన రైతులు తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌, పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు భూభారతితో రైతుల సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మాట్లాడుతూ ఈ మండలంలోని పలు గ్రామాలకు ఎంతో పోరాట చరిత్ర ఉందన్నారు. రుద్రంగి మండలానికి అన్ని రకాల నిధులిస్తామని హామీ ఇచ్చారు. 

త్వరలో వేములవాడ నుంచి ముంబైకి బస్సు : మంత్రి పొన్నం ప్రకటన

సిరిసిల్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ మాట్లాడుతూ వేములవాడ నుంచి ముంబయికి త్వరలోనే స్పెషల్‌‌‌‌ బస్సు ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతుల కష్టాలను తీర్చేందుకే భూ భారతి తీసుకొచ్చామన్నారు.