
- ఇద్దరు మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రమాదం
గంగాధర, వెలుగు : పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ మాలధారుడిని బైక్ ఢీకొట్టడంతో అతడితో పాటు ఓ యువకుడు చనిపోగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. ట్రైనీ ఎస్సై స్వాతి తెలిపిన వివరాల ప్రకారం... గాంగాధర మండలం గర్శకుర్తికి చెందిన కొండి శ్రీనివాస్ (34) హనుమాన్ మాల విరమణ కోసం మరికొందరితో కలిసి కొండగట్టుకు బయలుదేరాడు.
శుక్రవారం ఉదయం ఇస్లాంపూర్‌లో అల్పాహారం పూర్తి చేసుకున్న అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపూర్ గ్రామానికి చెందిన కాసాని గణేశ్ (22), కాసాని రాజు కరీంనగర్ సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన బోనాల పండుగకు హాజరయ్యారు. అనంతరం గురువారం అర్ధరాత్రి బైక్‌పై కరీంనగర్ నుంచి పూడూరు వైపు వెళ్తూ పాదయాత్రగా వెళ్తున్న శ్రీనివాస్‌ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108లో కరీంనగర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా శ్రీనివాస్, గణేశ్ మార్గమధ్యలో చనిపోయారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు