సర్కారు విధానాలతో పడిపోతున్న ఫ్లాట్ల అమ్మకాలు

సర్కారు విధానాలతో పడిపోతున్న ఫ్లాట్ల అమ్మకాలు
  • గడిచిన మూడు నెలల్లో 20 శాతం మేర తగ్గిన రిజిస్ట్రేషన్లు
  • సమ్మర్ లోనూ నెల ఆదాయం రూ.వెయ్యి కోట్లు మించలే
  • మార్కెట్ వాల్యూ పెంచినా  ప్రభుత్వానికి ఒరిగింది సున్నా!

వరంగల్ ప్రతినిధి/ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో రియల్​ఎస్టేట్​ఊపు తగ్గింది. ధరణి సమస్యలు, డీటీసీపీ వెంచర్ల పర్మిషన్లలో జాప్యం, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, గవర్నమెంట్ ల్యాండ్ వ్యాల్యూ పెంపు లాంటి పలు రకాల కారణాలతో  ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాలు పడిపోతున్నాయి. ఫలితంగా ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. భూముల క్రయ, విక్రయాలు ఎక్కువగా ఉండే సమ్మర్ సీజన్ లోనూ ఏప్రిల్ మినహా మే, జూన్ నెలల్లో ఆదాయం నెలకు రూ.వెయ్యి కోట్లు కూడా దాటలేదు. రెండోసారి మార్కెట్ వాల్యూ పెంచాక ఇన్ కం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావించినప్పటికీ.. అంతకుముందు నెలల్లాగే రావడం గమనార్హం. ప్రభుత్వం పెంచిన స్టాంప్ డ్యూటీ వల్ల సర్కార్కు  ఆదాయం పెరగాల్సి ఉన్నప్పటికీ.. గతంతో పో లిస్తే రిజిస్ట్రేషన్లు  తగ్గుముఖం పట్టడంతో ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదు.

సమ్మర్ లోనూ నెలకు రూ.వెయ్యి కోట్లు దాటలే.. 
రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట కూడా ఈసారి భూముల క్రయ, విక్రయాలు తగ్గిపోయాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన  ఏప్రిల్, మే నెలలోనే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈ ఫైనాన్షియల్​ఇయర్​ రిజిస్ట్రేషన్ల శాఖకు అంతగా కలిసిరాలేదు. సర్కారు పెంచిన పన్నుల ప్రభావం రియల్ ఎస్టేట్ బిజినెస్ పై కూడా పడిందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఏప్రిల్​లో ఆదాయం మెరుగ్గానే కనిపించినా మే నెలలో మాత్రం ఇన్​కం తగ్గిపోయింది. ఏప్రిల్ నెలలో 1,06,370 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.1003.18 కోట్లు,  మే నెలలో 94,229 రిజిస్ట్రేషన్లకు రూ.818.96 కోట్లు, జూన్ లో 1,07,286 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు రూ.989.86 కోట్ల ఆదాయం సమకూరింది.  2021–--22 ఫైనాన్షియల్​ఇయర్​లో కరోనా ఎఫెక్ట్​ ఉన్నప్పటికీ  సర్కారుకు రూ.12,364 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే సగటున ప్రతి నెలా 1030 కోట్ల ఇన్​కం వచ్చింది. కాగా, ఫిబ్రవరి 1 నుంచి సర్కారు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువ పెంచింది. అగ్రికల్చర్​ల్యాండ్స్​వాల్యూను కనిష్టంగా 50 శాతం, గరిష్టంగా150 శాతం పెంచారు. నాన్​అగ్రికల్చర్​ఆస్తులకు సంబంధించి ఫ్లాట్ల విలువను 25 శాతానికి పైగా.. ఒపెన్​ ప్లాట్ల వాల్యూను 35 శాతం మేర పెంచారు. దీంతో మార్కెట్​వాల్యూ గతంలో ఎకరాకు రూ. 5 లక్షలు ఉన్నచోట రూ.10 లక్షలకు చేరింది. దీని వల్ల సర్కారుకు రిజిస్ట్రేషన్​ఇన్​కం కనీసం 50శాతమైనా పెరుగుతుందని ఆశించినా ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకాలు పడిపోవడంతో ఆ మేరకు ఆదాయం తగ్గినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.

 సుప్రీం కోర్టు స్టే కూడా కారణమే..
రాష్ట్రంలో గుర్తింపు లేని, అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయొద్దని 2020 ఆగస్టు 26న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ సర్క్యులర్ నంబర్ 257 జారీ చేశారు. అప్పటి నుంచి సబ్‌-రిజిస్ట్రార్లు గుర్తింపు లేని లే అవుట్లలోని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో 5 వేల దాకా పిటిషన్లు దాఖలు చేసి కోర్టు అనుమతితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేయడంతో ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేని ప్లాట్ల క్రయ, విక్రయాలకు అనుమతి ఇవ్వొద్దని తీర్పునిచ్చింది. దీంతో ఇప్పటికే గతంలో అమ్ముడుపోయి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయొచ్చని, ఇప్పటివరకు అమ్మని నాన్ లే ఔట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం మే 20న సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఈ ఆదేశాలతో పార్ట్ రిజిస్ట్రేషన్లు, ఇల్లీగల్ లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు బంద్ కావడంతో డాక్యుమెంట్ల సంఖ్య 10 నుంచి 20 శాతం మేర తగ్గింది. 

 సర్కార్ విధానాలే శాపం.. 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి శాపంగా మారాయి. ధరణి సమస్యలు, డీటీసీపీ వెంచర్ల పర్మిషన్లలో జాప్యం, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, గవర్నమెంట్ ల్యాండ్ వ్యాల్యూ ఇలా పలు రకాల కారణాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జోరు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ల్యాండ్ వ్యాల్యూ పెంపు అమల్లోకి రాగా, ఆ తర్వాత ఇప్పటి వరకు నాలుగు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య చూస్తే క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. పట్టణాలు, నగరాల్లో చిన్న వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముకునే చోటా రియల్టర్ల దగ్గర నుంచి వందల ఎకరాల్లో డీటీసీపీ వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మే బడా వ్యాపారవేత్తల వరకు ఎవరితో మాట్లాడినా రియల్ ఎస్టేట్ రంగంలో స్లో డౌన్ గురించి స్పష్టంగా చెప్తున్నారు. గతంలో తాము నెలకు 100 ప్లాట్లు కనీసం అమ్మేవారమని, ఇప్పుడు అందులో మూడో వంతు కూడా అమ్మలేకపోతున్నామని ఖమ్మం సిటీకి చెందిన ఒక రియల్టర్ వాపోయారు. 

కొనేటోళ్లు ముందుకు వస్తలేరు
దాదాపు ఆరేండ్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. అమ్మేవాళ్లు, కొనేవాళ్లతో చాలా ఏండ్ల నుంచి పరిచయం వల్ల నెలకు కనీసం 10 ప్లాట్ల వరకు అమ్మేవాడిని. ఈ మధ్య మార్కెట్ స్లో అయ్యింది. రెండు నెలల నుంచి మూడు, నాలుగు ప్లాట్లు మాత్రమే అమ్మాను. చాలా రోజుల నుంచి ప్లాట్ కొనడం కోసం తిరిగిన వాళ్లు కూడా ఇప్పుడు స్పందించడం లేదు.  
-రాజేశ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఖమ్మం
నల్గొండ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో మార్చి వరకు ప్రతి రోజూ కనీసం 120 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ప్రతి నెలా సర్కారుకు సగటున కనీసం రూ.30 కోట్ల వరకు ఇన్​కం వచ్చేది. కానీ ఇప్పుడు రోజూవారీ 25 నుంచి 30 డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్​కావడం లేదు. ఏప్రిల్, మే లో కలిపి  కేవలం రూ.12.15 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. సూర్యాపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులోనూ ప్రతి రోజు 300 దాకా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగేవి. కానీ ఇప్పుడు వంద కూడా జరగడం లేదు. ఆదాయం కూడా సగానికి సగం పడిపోయిందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

నరేందర్ కు ఖమ్మం సిటీలోని మామిళ్లగూడెంలో 128 గజాల్లో రెండేండ్ల క్రితం కట్టిన డబుల్ బెడ్​రూమ్​ఇల్లు ఉంది. డబ్బులు అవసరమై ఆరు నెలల కింద ఆ ఇంటిని అమ్మకానికి పెట్టాడు. తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చూపించాడు. నరేందర్ రూ.42 లక్షలు చెబుతుండగా, కొందరు రూ.39 లక్షల వరకు బేరమాడి వెళ్లిపోయారు. నరేందర్ మాత్రం ఫైనల్ గా రూ.40 లక్షలకు అమ్ముతానని చెప్పాడు. రెండు నెలల నుంచి నరేందర్ రూ.37 లక్షల వరకు రేటు తగ్గించి అమ్మేందుకు సిద్ధపడినా కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.