80 శాతం పెరిగిన త్రీవీలర్ల సేల్స్​

80 శాతం పెరిగిన త్రీవీలర్ల సేల్స్​

ఏడాదిలో 26 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ ఇండస్ట్రీ ఈసారి నవంబరులో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించింది. కిందటి ఏడాది నవంబరుతో పోలిస్తే ఈసారి నవంబరులో రిటైల్ అమ్మకాలు 26 శాతం పెరిగాయి. ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్ అసోసియేషన్​ (ఫాడా) రిపోర్టు ప్రకారం... ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో దాదాపు 23.80 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 నవంబర్ లో 18.93 లక్షల యూనిట్లు  అమ్ముడుపోయాయి. కోవిడ్‌‌కు ముందు సంవత్సరం 2019  నవంబర్‌‌లో 23.44 లక్షల యూనిట్లు సేల్​ అయ్యాయి. అన్ని వర్గాల ఆటోమొబైల్స్ నవంబర్‌‌లో వృద్ధిని సాధించాయి. టూ-వీలర్లు 24 శాతం, త్రీ-వీలర్లు 80శాతం, ప్యాసింజర్ వెహికల్స్ (పీవీలు) 21 శాతం, ట్రాక్టర్లు 57 శాతం,  కమర్షియల్​ వెహికల్స్ (సీవీలు) 33 శాతం వృద్ధిని సాధించాయి. "ఈ ఏడాది నవంబర్​లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అత్యధికస్థాయిలో అమ్మకాలను సాధించింది. అయితే 2020  మార్చి సేల్స్​ను మినహాయించాలి. అప్పుడు  ఇండియా బీఎస్​4 నుండి బీఎస్-6 స్టాండర్డ్స్​కు​ మారింది. దీనివల్ల 2020  మార్చిలో  రిటైల్‌‌ అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ సీజన్‌‌లో (నవంబర్ 14 నుండి డిసెంబర్ 14 వరకు) పండుగ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. ఈ సీజన్​లో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని సింఘానియా వివరించారు. 

అన్నింట్లోనూ రెండంకెల గ్రోత్​..

2019 నవంబర్  ప్రీ-కోవిడ్ కాలంతో పోలిస్తే, టూ-వీలర్లు మినహా అన్ని కేటగిరీలలోని మొత్తం రిటైల్‌‌ అమ్మకాలు వరుసగా రెండవ నెలలో సానుకూల వృద్ధిని సాధించాయి. “టూవీలర్స్​ సెగ్మెంట్ 24 శాతం వార్షిక  భారీ వృద్ధిని చూపించింది. కోవిడ్‌‌కు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 0.9 శాతం మాత్రమే పడిపోయింది. ఈ సెగ్మెంట్ నెమ్మదిగా ఆటుపోట్ల నుంచి బయటపడుతోంది. 

పండుగ సీజన్​ అయిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న వివాహాల సీజన్ కారణంగా రిటైల్ విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని కంపెనీల నుంచి చాలా మోడల్స్​ అందుబాటులో ఉండటం మరో కారణం. కొత్త లాంచ్​ల సంఖ్య బాగుంది. రూరల్​ డిమాండ్​ కూడా మా ఇండస్ట్రీకి కలిసి వచ్చింది. కాంపాక్ట్​ ఎస్​యూవీ, ఎస్​యూవీ కేటగిరీ బండ్ల అమ్మకాలకు ఇప్పుడు తిరుగులేదు. ప్రభుత్వం ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, కొత్త మైనింగ్​ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఫలితంగా డిమాండ్​ మరింత పెరుగుతుంది. కంపెనీలు కొన్ని మోడల్స్​ ధరలు పెంచినప్పటికీ, ఇన్వెంటరీ ఎక్కువగాఉన్న  మోడల్స్​కు పెద్ద ఎత్తున డిస్కౌంట్స్​ ఇస్తున్నాయి. దీనివల్ల ఈ ఏడాది ముగిసేలోపు అమ్మకాలు ఇంకా పెరుగుతాయి. ఆర్​బీఐ రెపోరేట్లు పెంచడం వల్ల వెహికల్​ లోన్స్​ వడ్డీరేట్లు పెరుగుతాయి. దీనివల్ల  ఎంట్రీ లెవెల్​ ప్యాసింజర్​ వెహికల్స్​ అమ్మకాలపై ఎఫెక్ట్ ​ఉండొచ్చు. చైనాలో లాక్​డౌన్​ సమస్యల వల్ల సెమీకండక్టర్ల సరఫరా నెమ్మదించే అవకాశం ఉంది ” అని సింఘానియా చెప్పారు. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి పీవీల   సగటు ఇన్వెంటరీ 35–-40 రోజుల వరకు ఉండగా, టూవీలర్ల  ఇన్వెంటరీ 30-– 35 రోజుల వరకు ఉంది.