104 రన్స్ తేడాతో బంగ్లా చేతిలో పాక్ ఘోర ఓటమి.. సల్మాన్ ఆఘాపై నెటిజన్స్ ఫైర్

104 రన్స్ తేడాతో బంగ్లా చేతిలో పాక్ ఘోర ఓటమి.. సల్మాన్ ఆఘాపై నెటిజన్స్ ఫైర్

Salman Agha: క్రికెట్ స్టేడియంలో మాటల కంటే ఆటతో సమాధానం చెప్పడం ఎప్పుడూ మంచిదని పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘాకు ఇప్పుడు బాగా అర్థమైనట్లుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో అతడు చేసిన ఓవరాక్షన్ కామెంట్స్ ఇప్పుడు పాకిస్థాన్ జట్టును సోషల్ మీడియాలో నెటిజన్ల ఎగతాళి చేస్తున్నారు.

ఆఘా సవాల్: 
మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ముగిశాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌కు ఒక సవాల్ విసిరారు. "బంగ్లా గనుక ధైర్యం ప్రదర్శించి మాకు 260–-270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, మేము కచ్చితంగా విజయం కోసం ప్రయత్నిస్తాం.. కానీ వారు ఆ ధైర్యం చేస్తారని నేననుకోవడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆఘా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్, రెండో ఇన్నింగ్స్‌ను 240/9 దగ్గర డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ముందు 74 ఓవర్లలో 268 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. పాక్ కెప్టెన్ కోరుకున్న విధంగానే బంగ్లాదేశ్ భారీ టార్గెట్ ఇచ్చింది. 

కుప్పకూలిన పాకిస్థాన్: 
లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఒత్తిడికి లోనై కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 104 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సొంత గడ్డపై పాకిస్థాన్‌ను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. సవాల్ విసిరిన సల్మాన్ ఆఘా స్వయంగా 26 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. 

నెటిజన్ల ట్రోలింగ్: 
పాకిస్థాన్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో సల్మాన్ ఆఘాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. "260 పరుగుల ఛేజింగ్‌లో 26 పరుగులు చేస్తే సరిపోతుందని అతను భావించినట్లున్నాడని పేర్కొన్నాడు. మరో 10 ఓవర్లు ఓపికగా ఆడి ఉంటే కనీసం మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉండేదని, కానీ సల్మాన్ వ్యాఖ్యల వల్ల జట్టు అనవసరంగా ఒత్తిడిలోకి వెళ్లిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.