సల్మాన్ ఖాన్కు భద్రత పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం

సల్మాన్ ఖాన్కు భద్రత పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబై: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. సల్మాన్‌ తో పాటు ఆయన తండ్రి సలీమ్‌ ఖాన్‌లను చంపుతామంటూ ఆదివారం బెదిరింపు లేఖలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర హోం శాఖ ఆయనకు భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు క్రైం బ్రాంచ్ సల్మాన్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.

పంజాబ్ లో హత్యకు గురైన సింగర్ సిద్దూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ కు పడుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు బెదిరింపు లేఖ పంపారు. దీంతో సల్మాన్ బాంద్రా పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సల్మాన్‌కు గతంలో కూడా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింక వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను చంపేస్తామంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ అనే వ్యక్తి కోర్టు ఆవరణలోనే బెదిరించారు. సల్మాన్‌ హత్యకు అతని ముఠా చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.