
- హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ ట్రోఫీ సొంతం
- ఫైనల్లో టీమ్ ఆల్ఫాపై గ్రాండ్ విక్టరీ
హైదరాబాద్, వెలుగు: మహిళలే ఓనర్లు, కెప్టెన్‌గా ఉన్న ఏకైక గోల్ఫ్ టీమ్ సమా ఏంజెల్స్ హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (హెచ్‌పీజీఎల్) నాలుగో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచలన ఆటతో ముందుకెళ్లిన సమా తొలిసారి ట్రోఫీ గెలిచి అనుకున్నది సాధించింది. బ్యాంకాక్‌లోని నికాంటి గోల్ఫ్ కోర్స్‌లో శుక్రవారం జరిగిన మెగా ఫైనల్లో సమా ఏంజెల్స్ 60–20తో టీమ్ ఆల్ఫాను చిత్తు చేసింది.
మెగా ఫైనల్లో ఇరు జట్లలో ఎనిమిదేసి గోల్ఫర్లు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మొత్తం 80 పాయింట్లు అందుబాటులో ఉన్న ఈ టైటిల్ ఫైట్‌లో విజయానికి 45 పాయింట్లు అవసరం అయ్యాయి. అయితే, రెండు టాప్ టీమ్స్ మధ్య హోరాహోరీగా సాగుతుందని అనుకున్న ఫైనల్‌ను సమా ఏంజెల్స్ వన్‌సైడ్‌గా మార్చేసింది. టోర్నీలో అత్యంత నిలకడగా ఆడుతున్న అభిజయ్ 6–5తో అనిల్ రెడ్డిని ఓడించి సమాకు ఆరంభంలోనే ఆధిక్యం అందించాడు. ఇక కెప్టెన్ల మధ్య ఫైట్‌లో సమా ఏంజెల్స్ లీడర్ నేహా అహ్లువాలియా 5–4తో ఆల్ఫా కెప్టెన్ రమణా రెడ్డిని ఓడించింది. ఇదే జోరుతో సాలిల్ మూర్తి, పొలినేని వేణు, సోమ్ డే కూడా తమ మ్యాచ్‌ల్లో నెగ్గడంతో సమా ఈజీగా ట్రోఫీని అందుకుంది.
సమా సూపర్ పెర్ఫామెన్స్
సరోజ గడ్డం, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా, నేహా కెప్టెన్‌గా ఉన్న సమా ఏంజెల్స్ గత సీజన్‌లో గ్రూప్ దశలో సత్తాచాటి నాకౌట్‌కు చేరుకుంది. కానీ, క్వార్టర్ ఫైనల్లో టీమ్ ఆల్ఫా చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ సీజన్‌కు పక్కాగా ప్రిపేర్ అయిన సమా స్టార్టింగ్ నుంచే సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. తమ గ్రూప్‌లో టాపర్‌గా, ఓవరాల్‌గా రెండో ప్లేస్‌తో నాకౌట్‌కు దూసుకొచ్చింది. క్వార్టర్ ఫైనల్లో 80–0తో టూటోరూట్‌ను చిత్తు చేసింది.
దాంతో హెచ్‌పీజీఎల్, టీపీజీఎల్‌లో ఒక నాకౌట్ రౌండ్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. అదే జోరుతో సెమీస్‌లో డీఎస్‌ఆర్ పని పట్టిన సమా ఇప్పుడు ఫైనల్లో టీమ్ ఆల్ఫాను ఓడించింది. గత సీజన్‌లో క్వార్టర్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. హెచ్‌పీజీఎల్‌లో తొలిసారి టైటిల్ నెగ్గడంపై సమా ఓనర్ సరోజ గడ్డం సంతోషం వ్యక్తం చేశారు. మహిళా శక్తికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు.