
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హల్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యాలయంలో సమర్పించారు. స్పీకర్ ప్రస్తుతం లక్నోలో అందుబాటులోల లేకపోవడంతో ఆయన తరపున రాజీనామా కాపీ అందింది. కేంద్ర రాజకీయాల వైపు వెళ్లడానికి గల కారణాన్ని అఖిలేష్ పార్టీ నేతలకు వివరించారు.
త్వరలో కర్హల్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కూడా ఆయన నేతలతో చర్చించారు. కర్హాల్ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అఖిలేష్‌తో పాటు ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఎస్పీ ఎమ్మెల్యే అవధేష్ ప్రసాద్ కూడా రాజీనామా చేశారు.
ఇటీవల వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగంగా, సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో 37 స్థానాలను గెలుచుకుని లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక యూపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీలో సీనియర్ నేతల్లో శివపాల్ యాదవ్ ను నియమించే అవకాశం ఉంది.