ప్రతీకారం తీర్చుకోవడమే ఎస్పీ సిద్ధాంతం

ప్రతీకారం తీర్చుకోవడమే ఎస్పీ సిద్ధాంతం

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌లో బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను సమాజ్‌‌‌‌వాదీ పార్టీ ప్రేరేపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఇప్పుడు నకిలీ సమాజ్‌‌‌‌వాద్‌‌‌‌(నకిలీ సోషలిజం)కు, పేదల ప్రభుత్వానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. పేదలకు ఇండ్లు, బీసీలకు పథకాలు, మెడికల్ కాలేజీలు, రోడ్ల నిర్మాణం, ముస్లిం మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు.. కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలని అన్నారు. ‘‘ఈ రోజుల్లో ప్రజలు చాలా కలలుగంటున్నారు. అయితే కలలు నిద్రపోయే వారికే (అఖిలేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను ఉద్దేశిస్తూ) వస్తాయి. యోగి ఆదిత్యనాథ్ మేలుకునే ఉన్నారు. యూపీ అభివృద్ధి కోసం ఆయన పని చేస్తున్నారు” అని అన్నారు. సోమవారం వర్చువల్‌‌‌‌గా ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సమాజ్‌‌‌‌వాదీ పార్టీ టార్గెట్‌‌‌‌గా విమర్శలు చేశారు. 

అల్లరిమూకలు చెప్పిందే చట్టం
ఉత్తరప్రదేశ్‌‌‌‌లో ఐదేళ్ల కిందటి వరకు రౌడీలు, అల్లరిమూకల చేతుల్లో చట్టం ఉండేదని మోడీ మండిపడ్డారు. అలాంటి వాతావరణంలో ఆడపిల్లలు బయటికి రావాలంటేనే భయపడ్డారని అన్నారు. మాఫియా వాళ్లు ప్రభుత్వ అండతో రోడ్లపై ఫ్రీగా తిరిగే వాళ్లని అన్నారు. నాడు పశ్చిమ యూపీ అల్లర్లలో తగలబడి పోతుంటే.. అధికారంలో ఉన్న వాళ్లు సంబురాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఓ మూఢనమ్మకం కారణంగా నోయిడాకు వెళ్లేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వెనుకాడటంపై స్పందిస్తూ.. మూఢనమ్మకం వల్ల నోయిడాకు రాని వాళ్లు.. ఇక్కడి యువకులకు ప్రాతినిథ్యం వహించగలరా అని ప్రశ్నించారు. సొంత కరోనా వ్యాక్సిన్‌‌‌‌ను నమ్మని వాళ్లు, పుకార్లను మరింత వ్యాప్తి చేసే వాళ్లు.. యువత టాలెంట్‌‌‌‌ను, ఇన్నోవేషన్‌‌‌‌ను ప్రోత్సహించగలరా అని నిలదీశారు.