ఆయన నా భర్త కాదు..మాజీ భర్త..

ఆయన నా భర్త కాదు..మాజీ భర్త..
  • 'కాఫీ విత్ కరణ్" లో సమంత హాట్ కామెంట్స్
  • మళ్లీ ప్రేమలో పడే అవకాశమే లేదు
  • చైతుతో  నాకు అనుబంధమే లేదు..

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో విడిపోయాక..అనేక వార్తలు షికారు చేశాయి. అయితే వాటన్నింటిపై  సమంత క్లారిటీ ఇస్తోంది.  తాజాగా కరణ్ జోహార్ షో  కాఫీ విత్ కరణ్లో మాట్లాడుతూ మరిన్ని వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు కొన్ని ప్రశ్నలకు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ  సామ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ షోలో నాగచైతన్యతో విడాకులపై కరణ్ జోహర్ ప్రశ్నించారు. చైతుతో విడాకుల అంశం కఠినమైందని సమంత తెలిపింది. తమ విడాకులు అంత సామరస్యంగా జరగలేదని వెల్లడించింది. డివోర్స్ తీసుకున్న సమయంలో చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో జీవితం చాలా కఠినంగా అనిపించిందని సామ్ పేర్కొంది.

ఆయన భర్త కాదు..మాజీ..
భర్తతో విడిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డావని కరణ్ ప్రశ్నించిన సమయంలో..సామ్ ఒక్కసారిగా ఫైర్ అయింది. అతను నా భర్త కాదు మాజీ భర్త అనాలని కరణ్ కు గట్టిగా చెప్పింది. దీనికి కరణ్ సారీ చెప్పడంతో  సమంత శాంతించింది.  చైతుతో విడిపోయినప్పుడు మనోవేదనకు గురయ్యానని సమంత తెలిపింది. ఆ బాధ నుంచి బయటపడిన తర్వాత మరింత స్ట్రాంగ్ గా అయ్యానని చెప్పింది. తనకు చైతుకు మధ్య బాండింగ్ లేదని వెల్లడించింది. ఒకే రూమ్ లో ఉంచితే కూడా..ఇద్దరి మధ్య వివాదాలే నెలకొంటాయంది. ఫ్యూచర్ లో ఇరువురి మధ్య సఖ్యత పుడుతుందేమో చూడాలని చెప్పింది. 

నాపై నెగిటివ్ ప్రచారం..
చైతుతో విడిపోయినప్పుడు తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని సమంత తెలిపింది. ఆ సమయంలో వాటిపై స్పందించొద్దని వదిలేసానని పేర్కొంది అయితే తాను ఓపెన్ గా ఉండాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకే విడిపోయిన విషయాన్ని వెల్లడించినట్లు సమంత వివరించింది.  విడాకుల తర్వాత కొద్ది రోజులకే పుష్పలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని..ఆ పాట నచ్చడంతోనే చేసినట్లు సామ్ చెప్పింది. పురుషుల ఆధిపత్యంలోని లోపాలను ఎత్తిచూపేందుకు ఈ సాంగ్ ఉపయోగపడుతుందని భావించి..అవగాహన కల్పించేందుకు ఊ అంటావా మావా పాటను చేసినట్లు సమంత వెల్లడించింది. 

భరణంపై అన్నీ తప్పుడు వార్తలే..
చైతు నుంచి విడిపోయాక రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని ..అవన్నీ పుకార్లేనని సమంత కొట్టిపారేసింది. ఆ వార్తలను మొదట్లో షాక్ కు గురయ్యానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తన ఇంటికి వచ్చి..అవి అవాస్తవాలు అని చెబితే బావుండనిపించిందని వివరించింది. 

ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా జీవిస్తున్నట్లు సమంత చెప్పింది. మళ్లీ ప్రేమలో పడే అవకాశమే లేదని స్పష్టం చేసింది.