సాయి పల్లవి ప్లేస్‌లోకి నేనొచ్చా.. సమంత చెప్పిన మా ఇంటి బంగారం ముచ్చట్లు

సాయి పల్లవి ప్లేస్‌లోకి నేనొచ్చా.. సమంత చెప్పిన మా ఇంటి బంగారం ముచ్చట్లు

సమంత లీడ్‌‌గా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన  చిత్రం  ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం   జూన్ 19న  విడుదల  కానుంది. ప్రమోషన్స్‌‌లో భాగంగా ఈ చిత్రం గురించి సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది.   

ఈ సినిమాలో  తాను నటించాల్సింది కాదని, అసలు ఈ కథను సాయి పల్లవి కోసం రెడీ చేశారని సమంత చెప్పింది.  ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది.  మహిళా ప్రధాన కథలతో సినిమాలు రూపొందించాలనే లక్ష్యంతో తమ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌‌ను ప్రారంభించిందని,  మొదట ఈ కథను సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని డెవలెప్ చేసినట్టు సమంత తెలియజేసింది.  అయితే అప్పట్లో సాయి పల్లవి వరుస సినిమాలు, ఇతర కమిట్‌‌మెంట్లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌‌కు డేట్స్ కేటాయించడం సాధ్యపడలేదని తెలిసింది. దీంతో సాయి పల్లవి ప్లేస్‌‌లోకే  తానొచ్చినట్టు చెప్పింది.  

ఆ తర్వాత  రచయితలు, దర్శకులు కథలో కొన్ని మార్పులు చేసి, సమంత ఇమేజ్‌‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌‌ను మలిచారని ఆమె  రివీల్ చేసింది.  యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.