
హీరోయిన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన సమంత.. మరో అడుగు ముందుకేసి నిర్మాతగా మారింది. గత ఏడాది డిసెంబర్‌లోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో బ్యానర్ ప్రారంభించిన ఆమె, ఈ సంస్థలో నిర్మించబోయే మొదటి చిత్రాన్ని ఆదివారం ప్రకటించింది. తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది సమంత. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో ఇది తెరకెక్కబోతోంది.
ఇందులో సమంతనే లీడ్ రోల్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చీర కట్టు, మెడలో మంగళ సూత్రాలతో హౌజ్ వైఫ్‌లా కనిపిస్తున్న ఆమె, చేతిలో తుపాకి పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. ఇంటెన్స్‌గా ఉన్న ఈ పోస్టర్ చూడగానే ఇంప్రెస్ చేసేలా ఉంది. ఏదో ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్‌తోనే ఈ సినిమా రానుందని, ఇదొక లేడీ ఓరియంటెడ్ మూవీ అని పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం కెరీర్‌లో బ్రేక్ తీసుకున్న సమంత.. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది.