ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఊరు- వాడా తిరగడం సర్వసాధారణమే. పొద్దు పొడవగానే ఊర్లలో వాలిపోయే నేతలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తుంటారు. మహాత్మ సినిమాలో హీరో శ్రీకాంత్ 'హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తా..' అని చెప్పినట్లు సాధ్యం కానీ హామీలన్నీ ఇస్తుంటారు. తీరా గెలిచాక హామీల సంగతి దేవుడెరుగు.. కనీసం గ్రామాల వైపు కన్నెత్తైనా చూడరు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హర్యానలోని సమస్పూర్ గ్రామస్థులు రాజకీయ నేతలకు తగిన బుద్ధి చెప్పారు.
చర్ఖి దాద్రీ నియోజకవర్గంలోని సమస్పూర్ గ్రామస్థులు దశాబ్దాలుగా కలుషిత త్రాగునీటితో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్క్రరించాలని వారు ఎన్నిసార్లు నేతలను వేడుకున్నా.. అదిగదిగో చేసేద్దాం అంటున్నారు తప్ప చేసిన నాదుడే లేడు. ఇక లాభం లేదనుకున్న సదరు గ్రామస్థులు ఓట్ల కోసం తమ గ్రామానికి వచ్చే అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం(అక్టోబర్ 06) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో శుక్రవారం సమస్పూర్ గ్రామంలో నేతలు ప్రచారం పేరుతో తెగ హడావుడి చేశారు. ఈసారి గెలిపిస్తే నీటి సమస్యను పరిష్కరిద్దామని వారికి హామీ ఇచ్చారు. ఆ మాటలతో అవాక్కైన సదరు గ్రామస్థులు.. ఏ నీటిని త్రాగలేక వారు ఇబ్బంది పడుతున్నారో.. ఆ నీటిని త్రాగాలని నేతలను కోరారు.
నీటిని తాగినోళ్లకే వాళ్లకే మా ఓటు..
ఓటర్లను అభ్యర్థించడానికి గ్రామానికి విచ్చేస్తున్న ప్రతి నేతకు సమస్పూర్ గ్రామస్థులు అదే సవాల్ విసురుతున్నారు. ఈ నీళ్లు ఎవరైతే తాగుతారో వాళ్లకే మా ఓటు.. అని ముక్తకంఠంతో చెప్తున్నారు. దుర్వాసనను వెదజల్లుతున్న ఆ నీటిని త్రాగలేక.. వారిని ఓట్లు అడగలేక అభ్యర్థులు అక్కడినుండి మెల్లగా జారుకుంటున్నారు. సమస్యలు ప్రతి గ్రామస్థులు ఇలానే రాజకీయ పార్టీల నేతలకు తగిన బుద్ధి చెప్పాలని వారు సూచిస్తున్నారు.