దేశభక్తితో ఉన్నందుకు శిక్ష : సీబీఐ తనిఖీలపై సమీర్‌ వాంఖెడే

దేశభక్తితో ఉన్నందుకు శిక్ష : సీబీఐ తనిఖీలపై సమీర్‌ వాంఖెడే

దేశభక్తితో ఉన్నందుకు సీబీఐ దాడుల రూపంలో బహుమతి లభించిందని మాదకద్ర్యవ్య నిరోధక శాఖ మాజీ అధికారి సమీర్‌ వాంఖెడే పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సమయంలో రూ.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సమీర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సమీర్‌ వాంఖెడే నివాసంపై శుక్రవారం (12న)  సీబీఐ దాడులు నిర్వహించింది. దీనిపై సమీర్‌ స్పందిస్తూ తన భార్యాబిడ్డలతో ఇంట్లో ఉన్నప్పుడే 18 మంది అధికారులు వచ్చి తనిఖీలు చేశారని చెప్పారు. 

‘‘నేను దేశభక్తుడిగా ఉన్నందుకు బహుమతి లభించింది. 18 మంది సీబీఐ అధికారులు మా ఇంట్లో 12 గంటలపాటు తనిఖీలు చేశారు. ఆ సమయంలో నా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. వారికి రూ.23,000 నగదు.. కొన్ని ఆస్తి పత్రాలు దొరికాయి. ఆ ఆస్తులు నేను సర్వీసులో చేరడానికి ముందే లభించాయి’’ అని వాంఖెడే చెప్పారు. ఈ దాడుల సమయంలో సీబీఐ తన భార్య క్రాంతి వద్ద నుంచి ఫోన్‌ను తీసుకొన్నట్లు వివరించారు.

ఆర్యన్‌ ఖాన్‌ కేసులో లంచం డిమాండ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాంఖెడేతో సహా మరో ముగ్గురు అధికారులకు సంబంధించిన 29 చోట్ల శుక్రవారం సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలు ముంబయి, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లో జరిగాయి. లంచం డిమాండ్‌ ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ వాంఖెడేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే తనిఖీలు జరిగాయి.