సమ్మక్క జాతరకు సింగరేణి నిధులు.. రూ.2.94 కోట్లు కేటాయించిన సంస్థ

సమ్మక్క జాతరకు సింగరేణి నిధులు.. రూ.2.94 కోట్లు కేటాయించిన సంస్థ
  • సహకారం అందిస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎఫ్​సీఎల్ 
  • గోదావరిఖనిలోని జాతర ప్రదేశంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క–-సారలమ్మ జాతర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగరేణి రూ.2.94 కోట్లు కేటాయించింది. రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్, ఆర్ఎఫ్​సీఎల్​కూడా తమవంతు సహకారం అందిస్తున్నాయి. 

1992లో ప్రారంభం..

గతంలో సమ్మక్క జాతర సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎక్కువ మంది మేడారం వెళ్లడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగేది. వివిధ పరిశ్రమలకు బొగ్గు రవాణా జరగకపోవడంతో వాటిల్లో ప్రొడక్షన్​దెబ్బతినేది. ఈ విషయమై ఆలోచించిన సింగరేణి యాజమాన్యం 1992లో గోదావరిఖనిలోని గోదావరి నది ఒడ్డున పదెకరాల సంస్థ స్థలంలో సమ్మక్క జాతరను ప్రారంభించింది. అప్పటినుంచి ఏటా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. గతేడాది 6 లక్షల మంది వచ్చి, మొక్కులు చెల్లించుకున్నారు. 

రోడ్లు, ప్రహరీ, షెడ్ల పనులు

గోదావరిఖనిలో జరిగే సమ్మక్క జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. తదనుగుణంగా సౌకర్యాలు లేకుండా పోయాయి. దీంతో వారి ఇబ్బందులను గుర్తించిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్.రాజ్​ఠాకూర్ సౌకర్యాలు కల్పించాలనుకున్నారు. ఈ విషయమై సింగరేణి యాజమాన్యాన్ని సంప్రదించడంతో రూ.2.94 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం జాతర జరిగే స్థలం రోడ్డుకు దిగువన ఉండటంతో ఎత్తు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.

 సింగరేణి ఓపెన్​కాస్ట్​ నుంచి ఓబీ మట్టిని తీసుకువచ్చి ఇక్కడ నింపుతున్నారు. అలాగే జనగామ గ్రామం నుంచి సమ్మక్క తల్లిని తీసుకువచ్చే రోడ్డు ఎత్తును పెంచుతున్నారు. భక్తుల రాకపోకలకు వీలుగా సీసీరోడ్లు, మూడు వైపులా అప్రోచ్​రోడ్లు, చుట్టూ ప్రహరీ, షెడ్లు, గోదావరినది దగ్గర రెయిలింగ్ పనులు చేపడుతున్నారు. అమ్మవార్ల గద్దెల ఎత్తు పెంచే పనులు వేగంగా సాగుతున్నాయి.  

డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం

సమ్మక్క జాతర స్థలంలో భక్తుల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం సింగరేణి సంస్థ అధిక మొత్తంలో నిధులు సమకూర్చగా.. రామగుండం కార్పొరేషన్, ఎరువుల కర్మాగారం కూడా సహకారం అందిస్తున్నాయి. డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎంఎస్.రాజ్​ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం