సల్లంగ సూడు సమ్మక్క తల్లీ.. కొలువుదీరిన తల్లులకు.. కోటొక్క మొక్కులు

సల్లంగ సూడు  సమ్మక్క తల్లీ.. కొలువుదీరిన తల్లులకు.. కోటొక్క మొక్కులు
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
  • జనసంద్రంగా మారిన మేడారం పరిసరాలు
  • అమ్మవార్ల సేవలో ప్రముఖులు
  • జనవరి 31 న  సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో ముగియనున్న మహాజాతర

వరంగల్‌‌/ములుగు/తాడ్వాయి, వెలుగు :జనం.. జనం.. జనం.. కనుచూపు మేర ఎటుచూసినా జన ప్రవాహం.. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. సమ్మక్క, సారలమ్మలిద్దరూ గద్దెలపై కొలువు దీరడంతో శుక్రవారం తల్లుల దర్శనానికి జనం పోటెత్తారు.

 ‘సల్లంగ సూడు సమ్మక్క తల్లీ..’ అంటూ ఎత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం చుట్టూ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని జంపన్నవాగు, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్‌‌ మొదలు చింతల్‌‌ క్రాస్‌‌ వరకు ఎటుచూసినా పిల్లాపాపలు, ముల్లెమూటలతో భక్తులే కనిపించారు. ఇటు ఒకేసారి దర్శనానికి రావడంతో గద్దెల చుట్టూ అరకిలోమీటర్‌‌ మేర కనీసం నిల్చుకునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. 

మేడారంలోని టీటీడీ భవనం పక్క నుంచే సాధారణ, వీఐపీ, వీవీఐపీ క్యూలైన్ల నుంచి జంపన్న వాగు వైపు, ఇటు ఆర్టీసీ జంక్షన్‌‌ వైపు రద్దీ కారణంగా ఒకరినొకరు తోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా అదే సమయంలో విద్యుత్‍ సరఫరాలో అంతరాయం ఏర్పడి, భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు శుక్రవారం అమ్మవార్లను గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మతో పాటు మాజీ గవర్నర్‌‌ దత్తాత్రేయ, ఏఐసీసీ స్టేట్​ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‍, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తలసాని శ్రీనివాస్‌‌యాదవ్‌‌, బ్రిటీష్‌‌ డిప్యూటీ హైకమిషనర్‍ గ్యారత్‍ వెన్‌‌ ఒవెన్‍, పొలిటికల్‌‌ ఎకనామిక్‌‌ అడ్వైజర్‌‌ నళిని రఘురాం, డీజీపీ శివధర్‍రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైడ్రా కమిషనర్‍ రంగనాథ్‍, మాజీ మంత్రి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

 శుక్రవారం దర్శనం అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుగుముఖం పట్టడంతో మధ్యాహ్నం నుంచే మేడారం దారుల్లో ట్రాఫిక్​ స్తంభించింది. కాగా, తల్లుల వన ప్రవేశంతో మహాజాతర శనివారం అధికారికంగా ముగియనుంది.