V6 News

బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి.. ఏప్రిల్ 15న ప్రమాణ స్వీకారం

బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి.. ఏప్రిల్ 15న ప్రమాణ స్వీకారం

పాట్నా: బీహార్ నూతన సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, తారాపూర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. 2026, ఏప్రిల్ 15న నితీష్ కుమార్ వారసుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తద్వారా బీజేపీ నుంచి బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ రికార్డు సృష్టించబోతున్నారు. సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, తదితర ఎన్డీఏ కూటమి సభ్యులు హాజరుకానున్నారు. 

రాజ్య సభకు ఎన్నిక కావడంతో బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్‎కు అందజేశారు. నితీష్ రాజీనామాతో అధికార ఎన్డీఏ కూటమి బీహార్ కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం (ఏప్రిల్ 14) బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం బీహార్ శాసనసభ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరును బీజేపీ ప్రతిపాదించగా మిత్రపక్షమైన జేడీయూ మద్దతు ఇచ్చింది. దీంతో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా సామ్రాట్ చౌదరి యూనానిమస్‎గా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్డీఏ శాసనసభ పక్షం గవర్నర్‎ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరనున్నారు.