భారత అథ్లెట్ సామ్రాట్ రాణా చరిత్ర సృష్టించాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఈ 20 ఏళ్ల షూటర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. కైరోలో జరిగిన ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ గెలుచుకోవడంతో ఒలింపిక్ ఈవెంట్‌లో వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 243.7 పాయింట్లు సాధించి చైనాకు చెందిన హు కైని 0.4 పాయింట్ల తేడాతో ఓడించాడు.
సామ్రాట్ సీనియర్ ఆటగాడు వరుణ్ తోమర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించడంతో దేశానికి ఈ విభాగంలో రెండు పతకాలు వచ్చాయి. ఒకే ఈవెంట్‌లో ఇద్దరు పతకాలు సాధించడం దేశానికి ఇదే తొలిసారి కావడం విశేషం. ఫైనల్లో సామ్రాట్ 243.7 పాయింట్లు సాధించి చైనాకు చెందిన హు కైని 0.3 పాయింట్ల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ సంవత్సరం నాలుగు ప్రపంచ కప్‌లలో వ్యక్తిగత స్వర్ణాలు, ఆసియా ఛాంపియన్‌షిప్ వ్యక్తిగత స్వర్ణంతో పాటు ప్రపంచ కప్‌లలో రెండు మిక్స్‌డ్ టీమ్ స్వర్ణాలు గెలిచిన కై హు.. ఈ సారి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
►ALSO READ | Shreyas Iyer: మరో నెలపాటు రెస్ట్.. సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం
గోల్డ్ మెడల్ తర్వాత సామ్రాట్ రానా మాట్లాడుతూ.. "నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది నాకు సంతోషకరమైన, మర్చిపోలేని క్షణం. 2022లో కైరోలో జరిగిన జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నేను రెండు పతకాలు గెలుచుకున్నాను. నాకు అక్కడి వాతావరణం నచ్చింది. చివరి వరకు ప్రతి షాట్‌లో నా టెక్నిక్‌పై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాను. “నేను ప్రపంచంలోని గొప్ప షూటర్లతో షూటింగ్ చేస్తున్నానని నాకు తెలుసు. నేను బాగా రాణించాలనుకున్నాను. పతకం ఒత్తిడిని లేదా మైదానంలో నా పోటీదారుల ఉనికిని నేను తీసుకోలేదు." అని సామ్రాట్ విజయం తర్వాత చెప్పుకొచ్చాడు.
"నా తండ్రి షూటర్ కావాలని కోరుకున్నాడు. కానీ శిక్షణ పొందే స్తోమత ఆయనకు లేదు. కానీ ఆయన ఎప్పుడూ క్రీడపై ఆసక్తి చూపేవారు. షూటింగ్ చేపట్టమని నన్ను ప్రోత్సహించేవారు. నేను కర్నాల్‌లోని మా ఇంట్లో మా నాన్నతో కలిసి ప్రాక్టీస్ చేస్తాను". అని సామ్రాట్ ఎమోషనల్ అయ్యాడు.
