
న్యూఢిల్లీ: వెహికల్ పార్టులను తయారు చేసే సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎస్‌ఏఎంఐఎల్), జపాన్‌కు చెందిన యుటాకా గికెన్ కో. లిమిటెడ్ (వైజీసీఎల్) లో 81శాతం వాటాను 184 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,610 కోట్ల)కు కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా, వైజీసీఎల్ అనుబంధ సంస్థ షినిచి కొగ్యో కో. లిమిటెల్‌లో కూడా 11శాతం వాటా కొనుగోలు చేయనుంది. వైజీసీఎల్‌లో హోండాకు 69.66శాతం వాటా ఉంది.
ఈ డీల్ తర్వాత హోండా వద్ద 19శాతం ఓటింగ్ రైట్స్ మిగులుతాయి. మోటార్లు, బ్రేక్‌లు, థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌కు మెటల్ అసెంబ్లీలను వైజీసీఎల్ తయారు చేస్తోంది. ఈ డీల్ ద్వారా హోండాతో గ్లోబల్ భాగస్వామ్యం బలపడుతుందని, జపాన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) లతో వ్యాపారం విస్తరిస్తుందని ఎస్‌ఏఎంఐఎల్ తెలిపింది.
యుటాకా ఆటోపార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఇప్పటికే సంవర్ధన మదర్సన్ కొనుగోలు చేసింది. తాజా ఒప్పందానికి జపాన్, యూఎస్, చైనా, బ్రెజిల్, మెక్సికో నుంచి అనుమతులు అవసరం. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.