
ముషీరాబాద్,వెలుగు: కనీస మద్దతు ధరల చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్‌రోడ్డులో సంయుక్త కిసాన్‌మోర్చా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టగా రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మద్దతు ధరల చట్టం చేయాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, హౌంశాఖ సహాయ మంత్రి అశిష్‌కుమార్‌మిశ్రాను బర్తరఫ్ చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోర్చా రాష్ట్ర కన్వీనర్‌లు టి.సాగర్, కెచ్చల రంగయ్య, నాయకులు వస్కుల మట్టయ్య, వి. కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంఎస్‌పీపై కమిటీ ఏర్పాటు సరిగా లేదన్నారు. కమిటీలో 29 మందికి గాను కేవలం ముగ్గురు రైతు ప్రతినిధులకే అవకాశం కల్పించారని, మిగిలిన 26 మంది కార్పొరేట్‌శక్తులకు అనుకూలమైన వారని ఆరోపించారు.