చెన్నై: సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి కామెంట్చేశాడు. మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సమక్షంలోనే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనుషులను విభజించే సనాతనాన్ని నిర్మూలించాలని అన్నారు.
గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై భారీ దుమారం రేగినా, మద్రాస్ హైకోర్టు వాటిని 'ద్వేషపూరిత ప్రసంగం'గా పరిగణించినా.. ఆయన మాత్రం తన పంథాను మార్చుకోలేదు. సనాతనాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన పాత వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, మంగళవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల క్లిప్ ఒకటి వైరల్ అయింది. విజయ్ సమక్షంలో తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు అదే వాదనను పునరావృతం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
అదేవిధంగా ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదొక విషపూరితమైన వాదన అని విమర్శించారు. ‘పదేపదే ఇలాంటి తప్పులకు పాల్పడేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తమిళనాడు రాష్ట్ర చిహ్నానికి ఆలయ గోపురం ఉంది. తమ విశ్వాసాన్ని, మనోభావాలను ఇలా దారుణంగా దూషించడాన్ని, అవమానించడాన్ని తమిళనాడు ప్రజలు మరచిపోరు, క్షమించరు’ అని ఆయన పేర్కొన్నారు.
