- ప్రచార ఆర్భాటం కంటే ప్రజారోగ్యమే మాకు ముఖ్యం: మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ పనులు చివరి దశకు చేరుకున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. వచ్చే ఉగాది నాటికి పనులన్నీ పూర్తి చేసి ఆస్పత్రిని పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.
తమ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటాలు ఉండవని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ఆరాటమని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సనత్‌నగర్‌లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.."హాస్పిటల్ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఎలక్ట్రికల్ పనులు, ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్ విభాగాల పనులు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక స్కానింగ్ మిషన్ల బిగింపు పూర్తయింది. ఈ హాస్పిటల్‌లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. గుండె జబ్బులపై ఇక్కడ రీసెర్చ్ కూడా జరుగుతుంది. అవయవ మార్పిడికి అవసరమైన హైటెక్ ఆపరేషన్ థియేటర్లు రెడీ చేస్తున్నం. డాక్టర్ల నియామకాలు కూడా జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు.
