ఇసుక మాఫియా లొల్లి.. అడ్డొచ్చిన పోలీసులపై దురుసు ప్రవర్తన

ఇసుక మాఫియా లొల్లి.. అడ్డొచ్చిన పోలీసులపై దురుసు ప్రవర్తన

దందాలో అధికార పార్టీ నాయకులు..!

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో మానేరు తీరంలో ఇసుక మాఫియా జోరుగా నడుస్తోంది. ఈ సీజన్‌‌లో  వర్షాలు బాగా పడడం.. ఎల్ఎండీ గేట్లు ఎత్తడంతో మానేరులో దాదాపుగా రెండు మూడు నెలల నుంచి నీరు పారుతూనే ఉంది. దీంతో ఇసుక అక్రమ రవాణాకు కొంత బ్రేక్‌‌ పడింది. ఇప్పుడు గేట్లు క్లోజ్‌‌ చేయడంతో మళ్లీ దందా మొదలైంది. ఈ దందాలో గ్రూపులు మొదలుకావడం.. ఒకరి పరిధిలో మరొకరు ఇసుక తోడడంతో లొల్లి షురువైంది. మధ్యలో అడ్డం వచ్చిన  పోలీసుల తో కూడా ఇసుక మాఫియా దురుసుగా వ్యవహరిస్తోంది.

రాత్రి పగలు తేడా లేదు..

కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం నుంచి మొదలుకుని కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, వీణవంక, కరీంనగర్ రూరల్ మండలాల నుంచి మానేరు నది పారుతోంది. ఈ మండలాల్లో వాగుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో నిత్యం ఇసుక దందా నడుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా కొన్ని చోట్ల ఇసుక రీచ్‌‌లు ఏర్పాటు చేసినా.. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రూరల్ మండలం బొమ్మకల్, ఇరుకుల్ల వాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లతో అక్రమ రవాణా నడుస్తోంది. మానకొండూరు మండలం సదాశివపల్లి, శ్రీనివాస నగర్, లింగాపూర్ గ్రామాల పరిధిలో ఉన్న వాగు నుంచి అడ్డగోలుగా ఇసుక రవాణా జరుగుతోంది. కేవలం సదాశివపల్లి పరిధిలోని మానేరు వాగు నుంచి ప్రతిరోజూ 500 ట్రాక్టర్లకు పైగా ఇసుక కరీంనగర్ వైపు తరలిస్తున్నారు. అలాగే.. బొమ్మకల్ నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. కరీంనగర్ నగర శివార్లలో డంప్‌‌లు ఏర్పాటు చేసి.. హైదరాబాద్‌‌కు లారీల ద్వారా తరలిస్తున్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి.. పకడ్బందీ చర్యలు చేపట్టినా ఇసుకను తోడేస్తూనే ఉన్నారు.

అధికార పార్టీ నాయకుల హస్తం

జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. గుట్టుగా సాగుతున్న ఈ దందా ఇటీవల రాత్రి సమయంలో జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కార్పొరేటర్లు.. మరో అధికార పార్టికి చెందిన నాయకుడు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రూరల్ మండలం బొమ్మకల్‌‌కు చెందిన ట్రాక్టర్లు మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే టౌన్‌‌కు చెందిన కొందరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. దీంతో తమ ట్రాక్టర్లనే పట్టిస్తారా అంటూ కేబుల్ బ్రిడ్జి దగ్గర నగరానికి చెందిన నాయకులకు సంబంధించిన బండ్లు  ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ బొమ్మకల్ గ్యాంగ్ వాగ్వాదానికి దిగింది. దీంతో ఇరువర్గాల నడుమ బాగానే లొల్లి నడిచింది. ఇరు వర్గాలు మద్యం మత్తులో ఉండటంతో మాటామాటా పెరిగింది. అక్కడ జరిగిన లొల్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేశాయి. అధికార పార్టీకి చెందిన లీడర్లు సంఘటన స్థలంలో ఉండటం  విశేషం.

పోలీసుల మీదికే రివర్స్‌‌ అయితున్రు

మొన్నటికి మొన్న మానకొండూరు పరిధిలోని  మానేరు నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాని అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ మీద దాడి చేశారు. ఈ దాడిలో అతని కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినా దాడికి పాల్పడిన వారిపై కేసు కూడా నమోదు చేయలేదు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో బ్లూ కోట్  పోలీసులు బ్రిడ్జి దగ్గరకు వెళ్లగా టీఆర్‌‌‌‌ఎస్‌‌ కార్పొరేటర్ దగ్గరి మనిషి ఇష్టారీతిగా మాట్లాడాడు. తమ విధులకు ఆటంకం కలిగించారని బ్లూకోట్ పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. సదరు పొలిటికల్ లీడర్ అనుచరుడు మీద చర్యలు తీసుకుంటారా.. అనేది ప్రశ్నగా మారింది.

ఇసుక మాఫియాకు  అడ్డుకట్ట వేసేనా..?

కరీంనగర్ పోలీసు బాస్‌‌గా వీబీ కమలాసన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తయింది. నాటి నుంచి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఎందుకో ఈ మధ్య కొన్ని చోట్ల ఉదాసీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో తిమ్మాపూర్‌‌‌‌లో ఓ ప్రజాప్రతినిధికి సంబంధించిన ఇసుక డంపులు మాయం కావడం.. మానకొం డూరు, రూరల్ మండలాల్లో నిత్యం అక్రమ రవాణా జరగడం.. అడ్డొస్తున్న పోలీసులపై కూడా దాడులకు పాల్పడటం చూస్తుంటే పోలీసింగ్ గతి తప్పుతున్నట్లుగా అనిపి స్తోంది. ఇసుక అక్రమ రవాణాను కంట్రోల్ చేయాల్సిన మైనింగ్ అధికారులు మొద్దు నిద్రలో ఉండటం.. పోలీసులు అంతంత మాత్రంగానే పట్టించుకోవడంతో గ్రామా లు, నగరాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదంగా నడుస్తోంది.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్