పెన్​ గంగ ఇసుకను మింగేస్తున్నరు .. రూ.కోట్లలో సర్కారు ఆదాయానికి గండి

పెన్​ గంగ ఇసుకను మింగేస్తున్నరు .. రూ.కోట్లలో సర్కారు ఆదాయానికి గండి
  • జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
  • బోటు ఇంజిన్, జేసీబీలు తెచ్చి మరీ దందా
  • అటుగా కన్నెత్తి చూడని అధికారులు

ఆదిలాబాద్‌‌, వెలుగు: ఇసుక మాఫియా రూ.కోట్లలో సర్కారు ఆదాయానికి గండి కొడుతోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అక్రమ ఇసుకపై సీరియస్ అయ్యారు. కానీ, ఆదిలాబాద్​జిల్లాలో మాత్రం ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తయారు చేసే లోపు ఇసుకాసురులు అందినకాడికి దోచుకుంటున్నారు. పెన్ గంగతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాగులు, వంకల్లో ఇసుకను మింగేస్తున్నారు.

రూ.లక్షల్లో వేలం పాటలు

జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల్లోని చాలా గ్రామాల్లో వాగుల్లో వేలం పాట నిర్వహించి మరీ ఇసుకను తరలిస్తున్నారు. ఇందులో కొందరు మాజీ సర్పంచ్ లు ఉండగా, మరికొన్ని గ్రామాల్లో వీడీసీల పేరుతో వ్యాపారం చేస్తున్నారు. జైనథ్ మండలంలోని డోలార, కౌట, పెండల్ వాడ.. బేల మండలంలోని సాంగ్డి, మణియార్ పూర్, మాంగ్రూడ్, కొబ్బాయి.. భీంపూర్ మండలంలోని గొల్లగడ్ తాంసి, వడూర్ గ్రామాల్లో  రూ. 20 లక్షల నుంచి రూ.60 లక్షల వేలం పాటలు పాడారు. అత్యధికంగా బేల మండలంలోని మణియార్ పూర్ వాగులో ఇసుక తవ్వేందుకు ఓ లీడర్ రూ. 62 లక్షలకు దక్కించుకున్నారు. ఇలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఇసుక మాఫియా గండి కొడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

అనుమతులు లేకున్నా..

జిల్లాలో ఇసుక రీచ్ లకు ప్రభుత్వం ఎక్కడా అనుమతులు ఇవ్వలేదు.  ఇక్కడ ఇసుకను తొడితే భూగర్భజలాలు ఇంకిపోతాయని, రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతాయని గతంలోనే అధికారులు నివేదిక తయారు చేయడంతో ఇసుక క్వారీలకు అనుమతులు లభించలేదు. కానీ అక్రమ ఇసుక రవాణా మాత్రం నడుస్తోంది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇసుక తరలిపోతోంది. 

తవ్వకాలు కండ్లకు కనిపిస్తున్న ఏ ఒక్క శాఖ కూడా వాటిపై చర్యలు తీసుకోకపోవడం లేదు. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఇసుక వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం వందల ట్రాక్ట​ర్లలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నారు. నేరుగా వినియోగదారులకే ఇసుక అమ్మడంతోపాటు పెన్ గంగ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఎక్కువగా డంప్ చేస్తున్నారు.

పెన్ గంగ పొడవునా క్వారీలు..

సాధారణంగా వర్షకాలంలో ఇసుక కొరత ఉంటుంది. దీంతో సిండికేట్ గా మారి ఎక్కువ ధరలకు విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడం, పెద్ద ఎత్తున ఇసుక మేటలు బయటపడడం, రూ.కోట్లలో లాభాలు వస్తుండడంతో ఆఫీసర్లను మేనేజ్​ చేస్తూ వ్యాపారులు దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వీడీసీల ఆధ్వర్యంలోనే ఇసుక క్వారీలను వేలం వేస్తుండడంతో అక్రమాలపై ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ఇలా పెన్ గంగ పొడవునా దాదాపు అన్ని గ్రామాల్లో ఇసుక క్వారీలు అన్​అఫీషియల్​గా నడుస్తున్నాయి. ప్రధాన క్వారీల నుంచే కాకుండా చిన్నన్న వాగులోంచి దాదాపు 500 ట్రిప్పుల ఇసుకను ప్రతిరోజూ తరలి వెళ్తోంది. ట్రిప్పుకు రూ.3500 చొప్పున ఆరు నెలల కాలానికి దాదాపు రూ.30 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.

ఏడు ట్రాక్టర్లు సీజ్ చేశాం..

మండలంలో ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇప్పటి వరకు ఏడు ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశాం. పెన్ గంగ నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇంజిన్ బోటు విషయాన్ని మైనింగ్ అధికారులకు సమాచారం అందించాం. పెన్ గంగ తవ్వకాలు ఆ శాఖ పరిధిలోకి వస్తాయి.      
శ్యాంసుంధర్, జైనథ్, తహసీల్దార్