నకిలీ పర్మిషన్లతో ఇసుక దందా..

నకిలీ పర్మిషన్లతో ఇసుక దందా..
  • నకిలీ పర్మిషన్లతో ఇసుక దందా
  • రెవెన్యూ, పోలీస్, లీడర్ల మిలాఖత్​
  • సీజ్​చేసిన లారీలను వదిలేసిన పోలీసులు
  • మైనింగ్​ ఆఫీసర్ల ఆరాతో బయటపడ్డ అక్రమ దందా 

గద్వాల, వెలుగు: పోలీస్, రెవెన్యూ సిబ్బంది, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఫేక్ పర్మిషన్​ పేపర్లతో ఇసుక దందా కొనసాగించారు.  రూ. 2 కోట్లకు పైగా ఇసుకను దోచేశారు. పట్టుకున్న ఇసుక టిప్పర్లను వదిలిపెట్టడంపై మైనింగ్​ఆఫీసర్లు ఆరా తీయడంతో అక్రమ దందా గుట్టు బయటపడింది. వాస్తవంగా ఇసుకను తరలించాలంటే మైనింగ్ శాఖ పర్మిషన్ ఉండాలి. అయితే గద్వాలలో ఫేక్ పేపర్లనును సృష్టించి దానిపై తహసీల్దార్ ​సంతకం ఫోర్జరీ చేసి ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. ఒక క్యూబిక్ మీటర్ ఇసుకకు ప్రభుత్వానికి రూ. 614 చలానా కట్టాలి. కానీ నకిలీ పేపర్లతో ఏకంగా పదిన్నర క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు పర్మిషన్లు తీసుకొని అక్రమ దందా కొనసాగించారు.

రోజూ 45 టిప్పర్ల రవాణా
ఇసుక మాఫియా ప్రతిరోజు 15 టిప్పర్ల ద్వారా రోజుకు 45 ట్రిప్పుల్లో ఇసుకను తరలించింది. ఆర్ గార్లపాడు రీచ్ దగ్గర  నది నుంచి బయటకు తీసుకొచ్చే ఒక టిప్పర్ ఇసుకకు రూ. 10 వేలు చెల్లిస్తున్నారు. ఇందులో నియోజకవర్గస్థాయి లీడర్ కు రూ. ఐదు వేలు, గ్రామ చోటామోటా లీడర్లకు రూ. వెయ్యి, మరో నాలుగు వేలు పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లకు వాటా పంచుతున్నారు. ఇలా 3 నెలల నుంచి ఇసుక మాఫియా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ దందా కొనసాగిస్తోంది. 

బయటపడిందిలా..
ఈ నెల 20న ఇటిక్యాల మండలం గోసాల వద్ద 5 టిప్పర్ లను పోలీసులు సీజ్ చేశారు. అందులో రెండింటికి పర్మిషన్ ఉండడంతో విడిచిపెట్టారు. ఉన్నతస్థాయి రివ్యూ మీటింగ్ లో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ పర్మిషన్ ఉన్న టిప్పర్ లను వదిలిపెట్టామని పోలీసులు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మైనింగ్​శాఖ అనుమతి లేకుండా తహసీల్దార్ ​పర్మిషన్​ఎలా ఇస్తారని ఆఫీసర్లు ఆరా తీయడంతో నకిలీ పేపర్ల గుట్టు బయటపడింది. కాగా ఒక నెల  మామూలు సరిగా రాకపోవడంతో ఇటిక్యాల మండలం గోశాల వద్ద ఐదు టిప్పర్ల ను సీజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు
ఇసుక కోసం ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఇసుక రవాణాకు మైనింగ్ శాఖ పర్మిషన్ తప్పనిసరి. తహసీల్దార్​కు పర్మిషన్ ఇచ్చే రైట్స్ లేవు. నకిలీ పేపర్లతో అక్రమ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– విజయ రామారావు, ఏడీ, మైనింగ్ శాఖ

చర్యలు తీసుకుంటాం
తహసీల్దార్​పర్మిషన్ ఉన్నందు వల్లే ఇసుక రవాణా చేశారు. అవి నకిలీ పర్మిషన్​ పేపర్లని తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. పోలీసులు కూడా డబ్బులు తీసుకుంటే వారిపైనా చర్యలు తప్పవు.
– వెంకటేశ్వర్లు, సీఐ, శాంతినగర్