
బెంగళూరు: డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కన్నడ సినీ నటి రాగిణి ద్వివేదీని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాండల్ వుడ్ డ్రగ్ రాకెట్ కేసుతో రాగిణికి లింకులున్నాయని తెలియడంతో సీసీబీ పోలీసులు శుక్రవారం ఉదయం ఆమె ఇంటిపై రెయిడ్ నిర్వహించారు. రెయిడ్ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు తరలించారు. ప్రస్తుతం రాగిణి బెంగళూరులోని తన ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఆమె మొబైల్ ఫోన్ ను మార్చిందని సమాచారం. గురువారం రాగిణికి సీసీబీ సమన్లు విడుదల చేసింది. అయితే అధికారుల ఎదుట హాజరవ్వడానికి ఆమె లాయర్స్ ను పంపడం గమనార్హం.
గత నెల 21న కర్నాటకలో డ్రగ్ రాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బయట పెట్టింది. కొందరు డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేసింది. నిందితులను విచారిస్తున్న సమయంలో 15 మంది సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. కొన్ని రోజుల క్రితం రాగిణికి సన్నిహితుడైన రవిని అరెస్టు చేసిన పోలీసులు.. అతణ్ని ఇంట్రాగేట్ చేశారు. డ్రగ్ కేసులో రాగిణికి హస్తం ఉందని విచారణలో తేలడంతో తాజాగా ఆమె ఇంటిపై పోలీసులు దాడి చేశారు.