
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జూలై 25) ఢిల్లీలో జరిగిన రక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. శత్రుదేశం ఏమైనా రెచ్చగొడితే ఎదుర్కొనేందుకు భారత దళాలు 24 గంటలు రెడీగా ఉన్నాయని తెలిపారు. యుద్ధంలో రెండో స్థానం ఉండదని.. కేవలం విజేత మాత్రమే ఉంటారన్నారు. రక్షణ రంగ సాంకేతికతలో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు.
భద్రతా దళాలు యుద్ధంలోని మూడు స్థాయిలు అంటే వ్యూహాత్మక, కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సైనిక వ్యవహారాలలో ప్రస్తుతం మూడవ తరం నడుస్తోందని.. దీనిని నేను కన్వర్జెన్స్ వార్ అని పిలుస్తానన్నారు. ఈ రకమైన యుద్ధం మొదటి, రెండవ తరం యుద్ధంతో కలుపుతుందన్నారు. సైన్యం యుద్ధం, శాస్త్రం రెండింటినీ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కాగా, 2025, ఏప్రిల్ 22న ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము కాశ్మీర్లో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యేలా ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. బైసరన్ మైదానం ప్రాంతంలోని పహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు.
కేవలం ఒక వర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ మిషన్లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకో)లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి భారత భద్రతా దళాలు.