చెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తాం : సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్

చెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తాం : సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

జహీరాబాద్, వెలుగు :  చెరుకు రైతులెవ్వరూ అధైర్య పడరాదని, ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి అయినా బకాయి బిల్లులన్నీ చెల్లిస్తామని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ భరోసానిచ్చారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ తో కలిసి ట్రైడెంట్ చక్కెర కర్మాగారాన్ని ఆయన సందర్శించారు. ట్రైడెంట్ యాజమాన్యం చెరుకు రైతులకు ఇవ్వాల్సిన రూ.12.5 కోట్లను ఆర్ఆర్ యాక్ట్ ద్వారా ఆస్తులను వేలం వేసి చెల్లిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 

ఇప్పటికే యాజమాన్యానికి ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. రెండో నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేస్తామని చెప్పారు. ట్రైడెంట్ ఫ్యాక్టరీకి రూ.35 కోట్ల విలువ చేసే యంత్ర సామగ్రి, 50 ఎకరాల భూమి ఉందని, వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డి, అసిస్టెంట్ కెన్ కమిషనర్ రాజశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.