స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులు స్పీడప్ చేయాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులు స్పీడప్ చేయాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

ఝరాసంగం/ జహీరాబాద్ వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్​) ప్రాంతంలో కొనసాగుతున్న స్మార్ట్​ సిటీ మౌలిక వసతుల పనులను స్పీడప్​ చేయాలని సంగారెడ్డి కలెక్టర్​ప్రతీక్​ జైన్​, ఎస్పీ పరితోష్​ పంకజ్​సూచించారు. శనివారం ఝరాసంగం, న్యాల్​కల్​ మండలాల పరిధిలోని ఎల్గోయి, బర్దీపూర్, ఛీలెపల్లి, ఛీలెపల్లి తండా, రుక్మాపూర్, ముంగి ప్రాంతాల్లో పర్యటించి, ఆర్డీవో కార్యాలయంలో  ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  స్మార్ట్​సిటీ నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న అంతర్గత రోడ్లు, ఫినిషింగ్​ పనులను పరిశీలించారు. 

మొదటి విడతలో స్మార్ట్​ సిటీ నిర్మాణానికి కేటాయించిన భూమి వివరాలపై ఆరా తీసి, మ్యాప్​ను పరిశీలించారు. నిమ్జ్​ ప్రాంతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాల నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట నిమ్జ్​ ప్రత్యేకాధికారి విషాలాక్షి, వీరారెడ్డి, ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదానాయక్​, సీఐ హన్మంతు, తహసీల్దార్​ భాస్కర్​ ఉన్నారు.