ఖేడ్​లో పనులు కాని ప్రాంగణాల తీరుపై సంగారెడ్డి కలెక్టర్​ ఆగ్రహం 

ఖేడ్​లో పనులు కాని ప్రాంగణాల తీరుపై సంగారెడ్డి కలెక్టర్​ ఆగ్రహం 
  • గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం 

సంగారెడ్డి టౌన్, వెలుగు : క్రీడా ప్రాంగణాల పనులు పెండింగ్​లో పెడితే ఎలా..? ఎట్టి పరిస్థితుల్లో పనులన్నీ  గడువులోగా పూర్తి చేయాలి’ అని సంబంధిత సిబ్బందిని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్​ శరత్​ ఆదేశించారు. నారాయణఖేడ్ క్లస్టర్ ఏరియాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఎక్కువగా పెండింగ్​లో ఉండడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్​హాల్​లో డీఆర్​డీఏ, జిల్లా పంచాయతీ శాఖ అధికారులతో తెలంగాణ క్రీడా ప్రాంగణం, నర్సరీ, వైకుంఠధామం, వైకుంఠ రథం, ఎస్ఎస్ జీ గ్రూపులకు బ్యాంకు లింకేజీ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు సంబంధించి ఎఫ్టీఓలు ఇంకా పెండింగ్​లో ఉండటం సరికాదన్నారు.

ఈనెల 31లోగా అన్ని క్లస్టర్లలో ఎఫ్డీఓలు పూర్తి చేయాలని ఏపీడీలను ఆదేశించారు. నర్సరీలలోనూ ఈనెల చివరినాటికి మట్టి నింపడం, విత్తనాల కొనుగోలు చేయడం పూర్తి చేయాలని, క్లస్టర్ వారీగా సంబంధిత ఏపీడీలు పూర్తి బాధ్యత తీసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. బ్యాంకు లింకేజీలలో 85 శాతం పూర్తి చేయాలని డీపీఎంను ఆదేశించారు. వైకుంఠధామాలను అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. వైకుంఠ రథాలను క్లస్టర్ వారీగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో డీఆర్​డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్​మోహన్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.