జీపీ బిల్డింగ్‌ నిర్మాణాలు 30లోగా స్టార్ట్‌ చేయాలి

జీపీ బిల్డింగ్‌ నిర్మాణాలు 30లోగా స్టార్ట్‌ చేయాలి
  •     హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
  •     కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాకు మంజూరైన గ్రామపంచాయతీ భవనాల పనులను ఈ నెల 30లోగా ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్‌‌డీఏ, పీఆర్‌‌, ఎడ్యుకేషన్, బీసీ వెల్ఫేర్‌‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛసర్వేక్షన్ కింద మూడు కేటగిరీల్లో 15 జీపీలు ఉన్నాయని, ఆయా కేటగిరీల్లో ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు  మొక్కలు నాటాలని సూచించారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలకు బయో ఫెన్సింగ్ వేయాలని, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, విద్యాసంస్థల్లో నాటిన మొక్కల మధ్య గ్యాప్స్ భర్తీ చేయాలన్నారు.  

బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకం కింద  వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాపర్ గా పరిశీలించి.. అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.  స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీకి సంబంధించి ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మహిళా సమాఖ్యల ద్వారా చేపట్టిన వైద్య శాఖ  సబ్ సెంటర్ బిల్డింగ్స్ నిర్మాణాలపై దృష్టి సారించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీపీఎంలను ఆదేశించారు. మన ఊరు–మనబడి కింద  పూర్తయిన పనులకు ఎఫ్‌టీవోలు వెంటవెంటనే జనరేట్ చేయాలని, ఆయా స్కూళ్లలో మంజూరైన పనులన్నింటినీ గ్రౌండ్  చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు.   ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్‌‌డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేష్ మోహన్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.