ఏడు నెలలుగా జీతాల్లేవ్

ఏడు నెలలుగా జీతాల్లేవ్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో ఐసీయూ విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాలు అందడం లేదు. అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఆసుపత్రి గతంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కింద కొనసాగుతూ వచ్చింది. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ శాంక్షన్ కావడంతో జిల్లా ఆసుపత్రిని జనరల్ హాస్పిటల్​గా మార్చారు. అప్పటినుంచి ఈ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వెళ్లింది. కాగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్​లో(జీజీహెచ్) ఐసీయూ విభాగంలో ప్రస్తుతం 20 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో స్టాఫ్ నర్సులు ఆరుగురు, ఎఫ్ఎన్ఓలు ఇద్దరు, ఎంఎన్ఓలు ఆరుగురు, సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కరు, వివిధ హోదాల్లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. గతంలో టీవీవీపీ ప్రతి ఏడాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సర్వీస్ పొడిగించేది. దాంతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు క్రమం తప్పకుండా ప్రతినెలా జీతాలు ఇచ్చేవి. ఆసుపత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లడంతో ఉద్యోగుల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు రాలేవు. దీంతో  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా విధులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల విన్నపం మేరకు ఎట్టకేలకు అక్టోబర్ 14న సర్వీసును 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ వారికి జీతాలు  మాత్రం ఇవ్వలేదు.

ఇబ్బంది పడుతున్నాం.. 

ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నామని ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే చాలాసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఫలితం మాత్రం ఉండటం లేదని వాపోతున్నారు. గట్టిగా అడిగితే ఉద్యోగం పోతుందనే భయంతో ఎవరికీ చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నామని  తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. 

త్వరలో చెల్లిస్తాం

జనరల్ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో పనిచేస్తున్న 20 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమే. కానీ శాఖ పరంగా మార్పులు జరగడం తో ఇబ్బందులు ఎదురయ్యాయి. సిబ్బంది జీతాల చెల్లింపుల కోసం ఇదివరకే బిల్లులు ఇచ్చాం. ట్రెజరీలో కూడా టెక్నికల్ సమస్య రావడంతో కొంత ఆలస్యం జరిగింది. శాఖపరమైన సమస్య తొలగినందున త్వరలో వేతనాలు చెల్లిస్తాం.

‌‌‌‌‌‌‌‌ - అనిల్ కుమార్, జీజీహెచ్  సూపరింటెండెంట్