సంగారెడ్డిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌‌ 

సంగారెడ్డిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌‌ 

సంగారెడ్డి, వెలుగు: భారీ వాహనాలను చోరీ చేసి వాటిని విడిభాగాలుగా చేసి స్క్రాప్ దుకాణాలకు అమ్ముతున్న దొంగల ముఠాలో ఆరుగురిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌‌ కూకట్‌‌పల్లికి చెందిన మహమ్మద్ ఖుర్షీద్ అహమ్మద్(53), చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ జాఫర్ అలీ(55) భారీ వాహనాలను చోరీ చేసేవారు.

వీరు నదీమ్ ఖాన్, షేక్ అజాజ్, సయ్యద్ సయుద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇర్షాద్, గులాం రబ్బాని, సలావుద్దీన్, బాబా, మోహియిద్దీన్ షా, రేహాన్‌‌తో ముఠాను ఏర్పాటు చేశారు. ఈ ముఠా సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిపి ఇప్పటి వరకు 11 చోరీలు చేశారు. చోరీ చేసిన వాహనాలను మరోచోటకు తరలించి అక్కడ స్క్రాప్ చేసి అమ్మేవారు.

ఏప్రిల్ 11న ఓ డీసీఎం చోరి అయినట్లు మానూర్‌‌‌‌ పీఎస్‌‌ పరిధిలో కేసు నమోదైంది. సీసీఎస్‌‌ ఇన్‌‌స్పెక్టర్​ శివకుమార్‌‌‌‌, సీఐ శ్రీనివాస్‌‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నాలజీ సాయంతో దొంగల కదలికలను గుర్తించారు. ఈనెల 3న రాత్రి నారాయణఖేడ్ పంచగామ కమాన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ముఠా చోరీ గుట్టు బయటపడింది. ఆ సమాచారంతో అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.