
న్యూఢిల్లీ: ఇండియా లెజెండ్ సానియా మీర్జా ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెలుచుకుంది. తల్లి అయిన తర్వాత కూడా టెన్నిస్ కోర్టులో సక్సెస్‌ఫుల్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆమెను ఈ అవార్డు వరించింది. దాంతో, ఈ పురస్కారం గెలిచిన తొలి ఇండియన్‌గా హైదరాబాదీ రికార్డు సృష్టించింది. ఆసియా/ఓసియానియా జోన్ నుంచి ఇండోనేసియాకు చెందిన 16 ఏళ్ల ప్రిస్కా మడెలిన్‌ను ఓడించిన సానియా ఈ అవార్డు అందుకుంది. గ్రూప్––1లో మూడు రీజియన్స్ కోసం నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో పోలైన 16,985 ఓట్లలో ఆమె 10 వేల పైచిలుకు ఓట్లు సొంతం చేసుకోవడం విశేషం. మొత్తం ఓట్లలో ఏకంగా 60 శాతం సానియాకే వచ్చాయంటే ఫెడ్ కప్‌లో ఇండియా స్టార్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘ఫెడ్ కప్ హార్ట్ అవార్డు నెగ్గిన తొలి ఇండియన్‌గా నిలవడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డును దేశానికి, నా ఫ్యాన్స్‌కు డెడికేట్ చేస్తున్నా. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఫ్యూచర్‌లో దేశానికి మరిన్ని పురస్కారాలు సాధించి పెడతా. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందువల్ల ఈ అవార్డుతో పాటు వచ్చే డబ్బును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేయాలని నిర్ణయించా’ అని సానియా చెప్పుకొచ్చింది. ఈ అవార్డు కింద రూ. లక్షా 50 వేలు (2000 యూఎస్ డాలర్లు) నగదు ఇస్తారు. 2018లో కొడుకు ఇజాన్‌కు జన్మనిచ్చిన మీర్జా.. ఈ ఏడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ డబుల్స్ టైటిల్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక, నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లో బరిలోకి దిగిన సానియా అద్భుత పెర్ఫామెన్స్ చేసింది. టోర్నీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇండియాను ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.