
GST On Insurance: 79వ స్వాంతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ జీఎస్టీ సంస్కరణల గురించి కీలక ప్రకటన చేశారు. రానున్న కాలంలో కేవలం రెండు శ్లాబ్ రేట్ల కిందే జీఎస్టీ వసూళ్లు ఉంటాయని ఆయన చెప్పారు. దీంతో రానున్న కాలంలో కేవలం 5 శాతం, 18 శాతం జీఎస్టీ రేట్లు మాత్రమే ఉంటాయనే వాదన వినిపిస్తోంది.
ఈ సమయంలోనే దేశంలోని ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్న సంస్థలు చాలా కాలంగా కోరుతున్న జీఎస్టీ రేటు తగ్గింపు గురించి మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో ప్రజలకు చేరువ చేసేందుకు జీఎస్టీ రేటును ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్న అనేక సంస్థలు కోరుకుంటున్నాయి. అయితే ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత ఈసారి జీఎస్టీ సంస్కరణల్లో దీనిపై నిర్ణయం ఉండొచ్చని వారు భావిస్తున్నారు. జీఎస్టీ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్డీఎఏ లక్ష్యంగా పెట్టుకున్న “Insurance for All by 2047” గోల్ చేరుకోవటానికి జీఎస్టీ మదింపు అవసరమని నిపుణులు అంటున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చిన పన్నులు రూ.2వేల 101కోట్లుగా ఉండగా.. 2024 ఆర్థిక సంతవ్సరంలో జీఎస్టీ వసూళ్లు దీని నుంచి రూ.16వేల 398 కోట్లకు పెరిగాయని తేలింది. అయితే అందరికీ ఇన్సూరెన్స్ చేరాలంటే జీఎస్టీ రేటును 5 నుంచి 12 శాతం మధ్యకు తగ్గించాలని ఇన్సూరెన్స్ పరిశ్రమలోని కంపెనీలు కోరుతున్నాయి. ఇదొక పెద్ద విప్లవాత్మక మార్పుగా మారుతుందని వారు చెబుతున్నారు.
ఒకపక్క దేశంలో హెల్త్ ఖర్చులు 20-25 శాతం పెరుగుతున్న క్రమంలో ఇన్సూరెన్స్ సేవలు అందరికీ చేరువ చేయటం చాలా ముఖ్యమని ఇన్సూరెన్స్ సమాధాన్ సీఓఓ శిల్పా అరోరా చెబుతున్నారు. ప్రధానంగా కరోనా మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఖరీదైనదిగా మారిందని దీనిపై అదనంగా 18 శాతం జీఎస్టీ వేయటం మధ్యతరగతికి ఇన్సూరెన్స్ ఉత్పత్తులను దూరం చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను లగ్జరీ వస్తువులుగా కేంద్రం పరిగణించకూడదని.. వీటిపై జీఎస్టీ రేట్లను తగ్గించాలన్నారు.