ఊళ్లలో శానిటేషన్ సక్కగలేదు

ఊళ్లలో శానిటేషన్ సక్కగలేదు
  • అన్ని జిల్లాల్లో సగటున 40 పాయింట్లకు 30 లోపే స్కోరింగ్
  • 30 పాయింట్లతో సంగారెడ్డి, మంచిర్యాల, సూర్యాపేట కాస్త బెటర్
  • 22 స్కోర్‌‌‌‌తో లాస్ట్ ప్లేస్‌‌లో యాదాద్రి
  • సీఎంకు రిపోర్ట్ అందజేసిన స్టేట్ లెవల్ విజిటర్స్

హైదరాబాద్, వెలుగు: పరిశుభ్రత, పారిశుధ్యంలో రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలు వెనకబడిపోయాయి. కొన్ని జిల్లాలు కొంత ఫర్వాలేదనిపించినా.. సర్కార్ నిర్ణయించిన ప్రమాణాలను అందుకోలేకపోయాయి. గ్రామాల్లో శానిటేషన్, క్లీన్ నెస్ ఎలా ఉందో తెలుసుకునేందుకు స్టేట్ లెవల్ విజిటర్స్(ఎస్ఎల్‌‌వీ) రాష్ట్రంలోని 5,198 గ్రామపంచాయతీలను సందర్శించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ టీమ్స్ జిల్లాలవారీగా ఇచ్చిన స్కోరింగ్ వివరాలను పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు ఈ మధ్య అందజేశారు. ఆదివారం ప్రగతిభవన్ లో నిర్వహించిన సమీక్షలో ఇదే అంశంపై చాలా సేపు చర్చించినట్లు తెలిసింది. ఇన్నాళ్లు పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊళ్ల స్వరూపం మారిపోయిందని, గ్రామాల్లో రోజూ చేపడుతున్న శానిటేషన్ కార్యక్రమాలతో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, అద్దంలా మెరిసిపోతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉందని రిపోర్టులు రావడంతో షాక్ కు గురైనట్లు సమాచారం. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే సీఎం ఆకస్మిక పర్యటనల ప్రకటన చేశారని తెలిసింది.

ఒక్క జిల్లాకూ ఫుల్ స్కోర్ రాలే
గ్రామ పంచాయతీల్లో చేపట్టిన శానిటేషన్, రోడ్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, హరితహారం తదితర పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఉన్నది ఉన్నట్లుగా రిపోర్ట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రత్యేక బృందాలను నియమించింది. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో 5,198 గ్రామ పంచాయతీలను స్టేట్ లెవల్ విజిటర్స్ టీమ్స్ సందర్శించాయి. తర్వాత అంశాల వారీగా స్కోరింగ్ పాయింట్స్ ఇచ్చాయి. శానిటేషన్, క్లీన్ నెస్ పై స్కోర్ ను 40 పాయింట్స్ గా పెట్టుకుంటే.. ఏ జిల్లా కూడా ఫుల్ స్కోర్ ను చేరుకోలేకపోయింది. మంచిర్యాల, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలు అత్యధికంగా 30 స్కోరింగ్ సాధించగా, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాలు 29 పాయింట్లను స్కోర్ చేశాయి. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో 184 గ్రామాలను విజిట్ చేసి 28 స్కోరింగ్ ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం ఉన్న జనగామ జిల్లాలో 281 గ్రామాల్లో 157 గ్రామాలను సందర్శించి 26 పాయింట్లు ఇచ్చారు. శానిటేషన్, క్లీన్ నెస్ లో 22 స్కోరింగ్ పాయింట్స్ తో యాదాద్రి భువనగిరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

శానిటేషన్ వర్కర్లేరీ?
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణపై 2016లోనే నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్(ఎన్ఐఆర్డీ) దేశంలోని వివిధ రాష్ట్రాలకు పలు సిఫార్సులు చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్‌‌మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ – ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ ఫర్ గ్రామ పంచాయతీస్’ పేరుతో రిపోర్టు విడుదల చేసింది. ఇందులో ప్రతి 150 ఇళ్లకు ఇద్దరు శానిటేషన్ వర్కర్లు, ఒక ట్రై సైకిల్ చొప్పున ఏర్పాటు చేయాలని, శానిటేషన్ వర్కర్లకు జాకెట్, క్యాప్, గ్లోవ్స్, వాటర్ బాటిల్, ఫస్ట్ ఎయిడ్ కిట్ సమకూర్చాలని సిఫార్సు చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 66 లక్షల కుటుంబాలకు సుమారు 88 వేల మంది శానిటేషన్ వర్కర్లను నియమించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం 43 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్స్ మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో 59 ఏళ్లలోపు కార్మికులు 31,540 మంది ఉన్నారు. మిగతా 11,500 మంది 60 ఏళ్లు దాటిన వృద్ధులే. మొత్తం కార్మికుల్లో 12,769 మంది ట్రాక్టర్ డ్రైవర్లు, సుమారు 8 వేల మంది కారోబార్లు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా పారిశుధ్య కార్మికుల కొరతను అధికారుల మీటింగ్స్ లో పదేపదే ప్రస్తావిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.