పుస్తకాలే ఆమె ప్రపంచం

పుస్తకాలే ఆమె ప్రపంచం

హిందీ సాహిత్యం అంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఇష్టం. పెద్దయ్యాక నవలలు చదువుతూ, నాటకాలు వేస్తూ నచ్చినట్టు బతకాలి అనుకుంది. కానీ, చదువుకునే వయసులోనే పెండ్లి చేశారు. అయినా ఆమె నిరాశ పడలేదు. ఆమె పట్టుదల తెలిసి భర్త ప్రోత్సహించాడు. దాంతో డిగ్రీ చదివింది. పుస్తకాలు చదివే అవకాశం ఉంటుందని బుక్​షాప్​లో చేరింది. ఢిల్లీలోని శ్రీరామ్ సెంటర్​కు ఎదురుగా ఫుట్​పాత్ మీద లిటరేచర్ బుక్స్ అమ్ముతోంది. దాదాపు పాతికేండ్లుగా సాహిత్యం పుస్తకాలు అమ్ముతున్న ఈమె పేరు సంజనా తివారి. పుస్తకాలే ప్రపంచంగా బతుకుతున్న ఈమె గురించి...

శ్రీరామ్ సెంటర్​ దగ్గర నలుగురైదుగురు యంగ్​స్టర్స్ చేరారంటే చాలు.. డాన్స్​, నాటకాలు, రాజీయాలు, సాహిత్యం గురించిన ముచ్చట్లు జోరుగా నడుస్తాయి. వాళ్ల మాటల్ని వింటూ పుస్తకాలు అమ్ముతుంటుంది సంజన. రోజూ స్కూటీ మీద నాలుగైదు పెద్ద బ్యాగుల్లో పుస్తకాలు తెస్తుంది. సాయంత్రం కాగానే మళ్లీ పుస్తకాల్ని బ్యాగుల్లో సర్దుకుని ఇంటికెళ్లిపోతుంది.   

ఆర్థిక ఇబ్బందులతో...
సంజన పుట్టింది బీహార్​లో. ఏడేండ్ల వయసులో ఆమె  హరివంశ్ రాయ్ బచ్చన్ (అమితాబ్ బచ్చన్​ తండ్రి)రాసిన ‘ఆ రహీ రవి కీ సవారీ’ పద్యం చదివింది. ఆ పద్యం చదివాక సాహిత్యంపై ఇంట్రెస్ట్ పెంచుకుంది సంజన. పదిహేనేండ్లు వచ్చేసరికి హిందీ కవుల పుస్తకాలు చదివేసింది.  అయితే, మంచి సంబంధం వచ్చిందని ఆమెకు పదహారేండ్లకే పెండ్లి చేశారు. దాంతో, చదువుకోవాల్సిన వయసులో అత్తగారింట్లో అడుగుపెట్టింది. సంజన భర్త పేరు రాధేశ్యామ్. హిందీలో పుస్తకాలు రాసేవాడు. ఆయన సంజనని అర్థం చేసుకుని, ప్రోత్సహించాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల సంజన జాబ్ చేయాల్సి వచ్చింది.  శ్రీరామ్ సెంటర్​లోని ఒక బుక్​ సెంటర్​లో చేరింది. కొన్నేండ్ల తర్వాత ​మేనేజ్​మెంట్ బుక్​ షాపు ఖాళీ చేయించింది. దాంతో, శ్రీరామ్​ సెంటర్​కు ఎదురుగా ఉన్న చెట్టు నీడలో పుస్తకాలు అమ్మడం మొదలుపెట్టింది సంజన. తన దగ్గర పుస్తకాలు కొనేందుకు వచ్చే స్టూడెంట్స్​ని చూసి, తను కూడా డిగ్రీ చదవాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో ఈమధ్యే  డిగ్రీ పూర్తి చేసింది. పీజీ కూడా చేయాలని అనుకుంటోంది సంజన. 

కొత్తవాళ్లని ప్రోత్సహించాలని..
కొత్త రచయితల్ని ప్రోత్సహించడం కోసం వాళ్ల పుస్తకాల్ని పబ్లిష్​ చేస్తుంది సంజన. అందుకోసం తన పేరుతోనే  ఒక పబ్లికేషన్స్ నడుపుతోంది. సంజన దగ్గర సాహిత్యానికి సంబంధించిన ఏ పుస్తకమైనా దొరుకుతుంది. శ్రీరామ్ సెంటర్​కు వచ్చే స్టూడెంట్స్​ సంజనను ‘ఎస్​ఆర్​సి (శ్రీరామ్ సెంటర్) ఆంటీ’ అని ప్రేమగా పిలుస్తారు.  

ఇదే బతుకుదెరువు 
‘‘ఉదయాన్నే తొమ్మిదిన్నరకు పుస్తకాలు కొనేందుకు బుక్​స్టాల్స్​కు వెళ్తా. 11 గంటల్లోపు శ్రీరామ్​ సెంటర్​కు వస్తా. ఈ ప్లేస్ నాకు ఇల్లు లాంటిది. ఈ షాపు మీదే ఆధారపడి బతుకుతున్నా. ఈ షాప్​ లేకుంటే నా జీవితాన్ని ఊహించుకోలేను. ఒక్కోరోజు పుస్తకాలు  అమ్మితే  వంద రూపాయలు కూడా రావు. కానీ ఇక్కడి స్టూడెంట్స్​ నాపై చూపించే ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతీ కొత్త పుస్తకం చదువుతా. అంతేకాదు స్టూడెంట్స్ ఎవరైనా అడిగితే ‘పలానా బుక్​ చదవండ’ని చెప్తా” అంటుంది సంజన.